ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తొలుత సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయగా తర్వాత చంద్రబాబు మిగితా సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మినహా 173 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ శంబంగి అప్పలనాయుడు ప్రమాణస్వీకారం చేయించారు.
ఇక ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తొలిసారి ప్రమాణస్వీకారం చేసినప్పుడు దైవసాక్షిగా అనడానికి బదులు జగన్ సాక్షిగా.. అంటూ ప్రమాణం చేయడంతో ఆయనతో ప్రొటెం స్పీకర్ రెండోసారి ప్రమాణస్వీకారం చేయించారు.
స్పీకర్ ఎన్నిక రేపు జరగనుండగా తమ్మినేని సీతారాం అసెంబ్లీ కార్యదర్శి వద్ద నామినేషన్ దాఖలు చేశారు.ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. ఉభయసభల్ని ఉద్దేశించి శుక్రవారం గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు.