నల్ల ధనాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పెద్ద నోట్లను ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. 500, 1000 రూపాయల నోట్లు రద్దైన తర్వాత సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. మీకు జన ధన యోజన కింద బ్యాంకు అకౌంట్ ఉంటే మోడీ మీ అకౌంట్లోకి రూ. 5 లక్షల రూపాయలు వేస్తారు అని… పుకార్లు శికార్లు చేస్తున్నాయి. ఇక మోడీ అకౌంట్లో డబ్బులు వేస్తాడో.. లేదో… దేవుడెరుగు… కానీ ఉత్తరప్రదేశ్ లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ తాపీ మేస్త్రీకి చెందిన బ్యాంక్ అకౌంట్ లోకి అతనికి తెలియకుండానే రూ. 62 లక్షలు డిపాజిట్ అయ్యాయి. అంతకుముందు అతని అకౌంట్లో కేవలం రూ.7528 మాత్రమే ఉండేవి. కానీ ఒక్కసారిగా ఇంత నగదు వచ్చి చేరడంతో, ప్రస్తుతం ఆ అకౌంట్ను బ్యాంకు అధికారులు బ్లాక్ చేశారు. ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలంటూ అనిల్‌కు బ్యాంకు అధికారులు ఫోన్లు చేస్తున్నారు.
వివరాలోకి వెళ్తే.. ముంబైలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్న అనిల్ కుమార్ దీపావళికి సొంత ఊరికి వెళ్లాడు. ఏటీఎం సెంటర్ వాళ్ల ఊళ్లో లేకపోవడంతో, టికెట్ కోసం వాళ్ల ఊరి సర్పంచ్ నుండి రూ. 200 చేబదులు తీసుకున్నాడు. తీరా ముంబై వచ్చాక ఏటీఎంకు వెళ్లి డబ్బు డ్రా చేయబోతే… అకౌంట్ క్లోజ్ అయిందని మెసేజ్ వచ్చింది. అంతేకాదు, అకౌంట్లో రూ. 62 లక్షలు జమ అయ్యాయని, అంత సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలని ఫోన్ కు మెసేజ్ వచ్చింది. వెంటనే బ్యాంకుకు వచ్చి వివరాలు ఇవ్వాలని అందులో ఉంది. బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి ఫోన్ కూడా వచ్చింది.
కంగారు పడ్డ అనిల్ వెంటనే బ్యాంకు అధికారులను కలుసుకున్నాడు. ఆ డబ్బుకు తనకు సంబంధం లేదని, తన సొంత సొమ్మును డ్రా చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తే చాలని బ్యాంకు అధికారులను వేడుకున్నాడు అనిల్. ఈ డబ్బు బదిలీ అయిన సమయంలో తాను ముంబైలో లేనని, తాను స్వస్థలం యూపీలో ఉన్నట్టు ఉన్నానని చెప్పాడు. ప్రభుత్వం ఏం చేయదలుచుకుంటే అది చేయమని, కానీ తన అకౌంట్లో ఉన్న తన నగదును విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పటేల్ అభ్యర్థించాడు.
దీంతో, ఈ విషయం మొత్తం పేపర్ మీద రాసి, గ్రామ సర్పంచ్ తో సంతకం చేయించుకు రమ్మని బ్యాంకు అధికారులు సూచించారు. పటేల్కు జరిగిన విషయం విన్న తామందరం చాలా ఆశ్చర్యానికి గురయ్యామని, బ్యాంకు కోరిన వెంటనే తాము లేఖను అందిచామని గ్రామ పెద్ద చంఛల్ సింగ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, తన వద్ద డబ్బు అసలు లేదని, తండ్రి ఆరోగ్యం బాగాలేదని, ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన సమయంలో ఇలా జరిగిందని అనిల్ వాపోయాడు.