రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి.. ఎండ వేడికి ప్రజలు బయటికి రావలంటే జంకుతున్నారు.. ఎండల తీవ్రతకు తట్టుకోలేకపోతున్న ప్రజలకు మరో ‘వేడి’ వార్త. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదరనున్నాయి. రోహిణి కార్తె.. రోళ్లు పగిలే మంటలు రేపనుంది. భానుడి ఉగ్రరూపంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారనుందని ఆర్‌టీజీఎస్ హెచ్చరించింది.
మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠంగా 47నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వెల్లడించింది. నైరుతి రుతుపవనాల రాకలో జాప్యంతో వేడి మరింత పెరుగుతుందని స్పష్టమవుతోంది. ఈ రెండు రోజులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేప్పుడు ప్రజలు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో భానుడు కొంత శాంతించాడు. ఆదివారం రికార్డుస్థాయిలో 43.4 డిగ్రీలు నమోదవగా సోమవారం ఒక డిగ్రీ మేర తగ్గుముఖం పట్టి 42.5 డిగ్రీలుగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. గాలిలో తేమ 24 శాతంగా ఉందని చెప్పారు.
గాలిలో తేమ శాతం 30 నుంచి 40 శాతానికి పెరిగితే అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశమున్నట్టు తెలిపారు. వాటి కారణంగా గ్రేటర్‌లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించారు.