వైసీపీ శాసనసభా పక్ష నేతగా జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జగన్‌ని ఏకపక్షంగా వైసీపీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు.ఈ సందర్భంగా జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలు.
ఇక ఈ నెల 30న జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత ఆయన ఒక్కరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వెలువడ్డాయి. కానీ వైసీపీఎల్పీ భేటీలో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనతో పాటు 15 మందిచేత మంత్రులుగా జగన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారట.
కేబినెట్ రేసులో ప్రధానంగా వీరి పేరు వినిపిస్తోంది. బాలినేని శ్రీనివాస రెడ్డి (ఒంగోలు), ఆళ్ల రామకృష్ణా రెడ్డి (మంగళగిరి),శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు, విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణకు, తూర్పు గోదావరి జిల్లా నుంచి విశ్వరూప్ కు జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.
నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, కురుపాం ఎమ్మల్యే పాముల పుష్ప శ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే పి. రాజన్న దొర,విశాఖపట్నం నుంచి గుడివాడ అమర్నాథ్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, తూర్పు గోదావరి జిల్లా నుంచి దాడిశెట్టి రాజం, కన్నబాబు, అమలాపురం ఎమ్మెల్యే పినిపి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
పశ్చిమ గోదావరి నుంచి ఆళ్ల నాని, ముదునూరి ప్రసాద రాజు, గ్రంథి శ్రీనివాస్, తెల్లం బాలరాజు రేసులో ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని, ఆళ్ల నాని, జోగి రమేష్, కె. పార్థసారథి మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు.
గుంటూరు జిల్లా నుంచి కోన రఘుపతి, నెల్లూరు జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ యాదవ్, ఆనం రామనారాయణ రెడ్డిలకు అవకాశం ఉంది.చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రోజా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కడప జిల్లా నుంచి ఆజ్మత్ బాషా షేక్, అనంతపురం జిల్లా నుంచి అనంత వెంకటరామిరెడ్డి, కర్నూలు జిల్లానుంచి బుగ్గన రాజేందర్నాథ్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉండటం,తొలిదశలో 15 మందికే అవకాశం దక్కనుండటంతో జగన్ నిర్ణయమే ఫైనల్ అని పార్టీ నేతలు చెబుతున్నారు.