కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్‌పై ప్రశంసలు గుప్పించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చనిపోయిన తర్వాత అంతిమయాత్ర కూడా నిర్వహించుకోలేని పేదలు ఇది ఉపయోగపడుతుందని తెలిపిన కేటీఆర్ మేయర్‌తో పాటు ఎమ్మెల్యే,కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు. ఇదే ట్వీట్‌ను అరవింద్ కుమార్‌కు ట్వీట్ చేసిన కేటీఆర్ మిగితా అర్బన్ ఏరియాల్లో ఈ స్కీంను ప్రవేశపెట్టే అంశంపై దృష్టిసారించాలని కోరారు.
ఒక రూపాయికే నల్లా కనెక్షన్ పథకాన్ని ప్రారంభించి అందరి మన్ననలు పొందిన కరీంనగర్ నగర పాలకసంస్థ మరో అద్బుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పేద, మధ్య తరగతి ప్రజలకు భారం కలగకుండా నగర పాలక ద్వారా రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు నిధులు కేటాయించడంతోపాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా ఉంటామని ప్రకటించారు.
నగరంలో ఎవరు చనిపోయినా రూపాయి చెల్లిస్తేచాలు వారి మత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు, దహనసంస్కారాలు చేపడతామని తెలిపారు. అంతేగాదు పార్ధీవదేహం తరలింపుకు రెండు వ్యాన్లు,అవసరమైతే ఫ్రీజర్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. అదే రోజు మరణ ధృవీకరణ పత్రం అందించడంతో పాటు ఇంటి దగ్గర 50 మందికి రూ.5కే భోజనం కల్పించే కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. జూన్ 15 నుండి ప్రారంభంకానున్న ఈ పథకం పేద,మధ్య తరగతి వర్గాలకు ఊరటకానుంది. మేయర్ రవీందర్ సింగ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.