బెంగాల్‌లోని 9లోక్‌సభ నియోజకవర్గాల్లో తుదివిడత ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. పలు చోట్ల ఈవీఎంలు మోరాయించడం, వీవీప్యాట్లు పనిచేయకపోవడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్లో ఈ ఎన్నికల తుదివిడతలోనూ అక్కడక్కడ ఘర్షణలు జరిగాయి. బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి.పోలింగ్ ఏజెంట్లను బెదిరించి బయటకు పంపుతున్నారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.
బెంగాల్ మినహా మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. డోంగారియా ప్రాంతంలో డైమండ్ హార్బర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి నిరంజన్ రాయ్ కారును దుండగులు ధ్వంసం చేశారు. బిహార్‌లోని నలంద జిల్లాలోని ఓ గ్రామంలో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. తమ గ్రామంలో రోడ్లు లేవు.. ఓట్లు వేయమని నిరసన తెలిపారు.
మరోవైపు శనివారం రాత్రి రాజర్హట్ ప్రాంతంలోని భాజపా కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. మథురాపూర్ లోక్‌సభ పరిధిలోని రైడిఘి అసెంబ్లీ నియోజకవర్గంలో నాటు బాంబుల దాడులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఇక గత విడతల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో చివరి విడతకు పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. 710 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు. ఈ విడతలో 9 నియోజకవర్గాల నుంచి మొత్తం 111 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.