ప్రతిఏటా రంజాన్‌ను ప్రభుత్వం అధికార కార్యక్రమంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా రంజాన్ కోసం ముమ్మర ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 832 మసీదులకు ఇఫ్తార్ విందు కోసం ప్రతి మసీదుకు లక్ష రూపాయలు అందజేయనుంది. దీంతో పాటు పేద ముస్లింలకు పంపిణీ చేసేందుకు 4.50 లక్షల గిఫ్ట్ ప్యాక్‌లను సిద్ధం చేసింది.
రంజాన్‌కు 15 రోజుల ముందుగానే గిఫ్ట్ ప్యాక్‌లను పేద ముస్లింలకు అందజేసేలా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ రంజాన్ గిఫ్ట్‌లను తయారు చేయించిన ప్రభుత్వం ఈ నెల 18 నుంచి జిల్లాల్లో, 20 నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పంపిణీ ప్రారంభించి రాష్ట్రమంతటా మే 25 కల్లా పూర్తిచేయాలని నిర్ణయించింది. గిఫ్ట్‌ప్యాకులో ఒక చీర, సల్వార్ కమీజ్, కుర్తా పైజామా, ఒక బ్యాగు ఉంటాయి.
ఒక్కో మసీదు ద్వారా 500 మందికి చొప్పున జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎంపికచేసిన 448 మసీదుల్లో మొత్తం 2.24 లక్షల గిఫ్ట్ ప్యాకులను పంపిణీ చేయనున్నారు. మిగిలిన జిల్లాల పరిధిలో ఎంపికచేసిన 367 మసీదులతోపాటు 17 రిజర్వ్ మసీదులను కలుపుకొని 384 మసీదుల్లో 1.92 లక్షల గిఫ్ట్ ప్యాకులను అందజేస్తారు.
రంజాన్ గిఫ్ట్ ప్యాకుల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రతి మసీదులో కమిటీని ఏర్పాటుచేశారు. వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, పేదవారిని గుర్తించి గిఫ్ట్‌ప్యాకులను పంపిణీ చేస్తారు. ఇ మసీదులకు కేటాయించిన నిధుల నిర్వహణను ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. మొత్తంగా రంజాన్‌కు ముందే కేసీఆర్ తోఫా పేదవారి ఇళ్లకు చేరుతుండటం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.