టీవీ 9 కొత్త సీఈఓగా మహేంద్ర మిశ్రను నియమిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. టీవీ 9 ఫౌండర్ సీఈవో రవి ప్రకాష్‌పై ఫోర్జరీ సంతకం ఆరోపణలు రావడంతో ఆయన్ని సీఈవోగా తొలగించింది కొత్త యాజమాన్యం. అంతేగాదు కొత్త సీఓఓగా సింగారావును నియమించారు.
శుక్రవారం సమావేశమైన ఏబీసీఎల్ బోర్డు డైరెక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. .మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఛానెల్‌కు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.ఇక 10 టీవీకి ఎడిటర్‌గా పనిచేస్తున్న గొట్టిపాటి సింగారావును సీఓఓగా నియమించారు.
టీవీ9 పేరుతో తెలుగు సహా పలు భాషల్లో ఛానళ్లను నిర్వహిస్తోన్న అసోసియేట్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్)లో వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్‌కు 90శాతం వరకు వాటాలుండేవి. ఆ సంస్థ సీఈవో, డైరెక్టర్ రవిప్రకాశ్, ఆయన సహచరులకు 8.3శాతం వాటాలున్నాయి. గత ఏడాది ఆగస్టు 24న ఏబీసీఎల్‌లోని శ్రీనిరాజు సంస్థల వాటాలను అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసింది.
ఈ నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగించి ఆర్థికంగా దెబ్బ తీయాలనే దురుద్దేశంతో రవిప్రకాశ్ కుట్ర పన్నారని ,డైరెక్టర్ల సంతకాలు ఫోర్జరీ చేశారని కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవిప్రకాశ్‌తోపాటు సినీనటుడు శివాజీ, మరికొందరిపై ఫిర్యాదు చేశారు. దీంతో రవిప్రకాశ్‌తోపాటు ఎం.కె.వి.ఎన్.మూర్తి, మరికొందరిపై 420, 468, 471, 120 (బి) ఐపీసీ, ఐటీ చట్టం 66-సి, 66-డి సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి రవిప్రకాశ్ టీవీ 9 ఛానల్ ద్వారా వివరణ ఇచ్చినా యాజమాన్యం వెనక్కి తగ్గలేదు. ఆయన్ని సీఈవో తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడమే కాదు కొత్త సీఈవోను నియమించింది.