దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచన గొప్పదన్నారు సినీ నటుడు ప్రకాష్ రాజ్. కేసీఆర్ ప్రధాని కావాలని ఫ్రెడరల్ ఫ్రంట్ నినాదాన్ని ఎత్తుకోలేదని దేశ అభివృద్ధి, ప్రజల కోసం ఆలోచించి ఫ్రెడరల్ ఫ్రంట్ అన్నారని తెలిపారు. సిఎం కేసీఆర్ పాలన బాగుందని..మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరిత హారం గొప్ప పథకాలు అని తెలిపారు. రైతు బంధు ఎంతో ప్రతిష్టాత్మకమైన పథకం అందుకే తెలంగాణ ప్రజలు సైతం సిఎం కేసీఆర్ కు అఖండ విజయాన్ని అందించారని చెప్పారు.
ఢిల్లీలో ఆప్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఏ పార్టీ చేయలేదన్నారు. భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే పార్టీ ఆప్ అన్నారు. ప్రైవేటు విద్యాలయాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు. నీరు,విద్యుత్, మొహల్లా క్లినిక్స్ మెరుగుపరిచారని..మతం కులం గురించి మాట్లాడకుండా ఢిల్లీని కేజ్రీవాల్ అభివృద్ధి పరిచారని తెలిపారు.
కాంగ్రెస్, బిజెపిలు దేశానికి చేసిందేమీ లేదన్నారు. మోడీకి సిగ్గుండాలని మండిపడ్డ ప్రకాష్ రాజ్…ఉద్యోగాలు,నల్లధనం,రైతుసమస్యలను పరిష్కరించలేదన్నారు. అందుకే ముస్లిం, హిందూ గొడవల గురించే మాట్లాడుతున్నారని చెప్పారు.
కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న మోడీ ఇప్పుడు బిజెపి ముక్త్ భారత్ చేశారని చెప్పారు. మోడీని చూసి ప్రజలు ఓటేసే పరిస్థితి లేదన్నారు.ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ లాంటి వారిని ఎన్నికలలో ఎలా నిలబెడతారని ప్రశ్నించారు. ప్రధాని దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపిన ప్రకాష్ రాజ్…మోడీ ప్రధానిలా వ్యవహరించాలన్నారు.
దేశానికి కేజ్రీవాల్ ,కన్హయ్య కుమార్,జిగ్నేష్ మేవానీ,కెసిఆర్ లాంటివాళ్ళు కావాలన్నారు.కెజ్రీవాల్ పై దాడులు జరిగితే ఆయన బలపడతారని ప్రజలు తమ అభ్యర్థిని చూసి ఓటువేయాలన్నారు. 2019 ఎన్నికలలో రెండు జాతీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని జోస్యం చెప్పారు ప్రకాష్ రాజ్.
ఓటర్లు తమ ఓటుహక్కును తప్పని సరిగా వినియోగించుకోవాలన్నారు.అబద్దాలు చెప్పేవాడు మాట్లాడుతున్నపుడు మౌనంగా ఉండటం నేరం..ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలన్నారు.