వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. రాజకీయాలు కొన్ని కుటుంబాల్లో చిచ్చు పెడితే ఇక్కడ మాత్రం అవే రాజకీయాలు ఓ జంటను కలిపాయి. చిన్న మనస్పర్ధతో ఐదేళ్లుగా దాంపత్య జీవితానికి దూరమైన వాళ్లు స్ధానిక ఎన్నికల నేపథ్యంలో ఒక్కటయ్యారు. ప్రాదేశిక పోరులో తన సమీప ప్రత్యర్థి అంబటి నీరజ(బీజేపీ)పై 480 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రామడుగు ఎంపీపీ స్థానం ఎస్సీకి రిజర్వ్ కావడంతో ప్రస్తుతం అధిష్ఠానం వారికే ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మండలంలో 14 ఎంపీటీసీ స్థానాల్లో ఆరు స్థానాల్లో టీఆర్ఎస్, మరో ఇద్దరు పార్టీ తిరుగుబాటు అభ్యర్థులు సైతం టీఆర్ఎస్ క్యాంపునకే చేరినట్లు సమాచారం. దీంతో సంపూర్ణ మెజార్టీతో వీరికి ఎంపీపీ పీఠం దక్కే అవకాశం ఉంది.
కరీంనగర్ జిల్లా రామగుడు మండలంలోని మోతె ఎంపీటీసీ స్ధానం ఎస్సీకి రిజర్వు అయింది. పలువురు అభ్యర్థులు ఎంపీటీసీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోరటపల్లికి చెందిన సీనియర్ నేత కలిగేటి లక్ష్మణ్ వైపు పార్టీ నేతలు మొగ్గుచూపారు. ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నా కుటుంబ గొడవల కారణంగా ఆయన భార్య కాపురానికి రావడం లేదన్న విషయాన్ని గుర్తించిన పార్టీ నేతలు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు.
తన తల్లికి టికెట్ ఇస్తే గెలిపించుకుంటానని లక్ష్మణ్ చెప్పినా పార్టీ నేతలు వినలేదు. అంతేగాదు నీ భార్యను తీసుకొని వస్తేనే టిక్కెట్ ఇస్తాం అని చెప్పడంతో గత్యంతరం లేక లక్ష్మణ్ తన భార్య తరఫు బంధువులతో సంప్రదింపులు జరిపాడు. కాపురానికి వచ్చేలా ప్రయత్నాలు చేసి భార్య కవితను ఒప్పించారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ భార్యకు టికెట్టు కేటాయించారు. ఎన్నికల్లో గెలిచిన నీరజ ఎంపీపీ కాబోతున్నారు.