నీట్‌లో తెలంగాణ మాధురి టాప్‌..

301
neet results
- Advertisement -

ఎంబీబీఎస్‌, డెంటల్ కళాశాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)-2019 ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. రాజస్థాన్‌కు చెందిన నళిన్‌ ఖండేల్‌వాల్‌ జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించగా తెలంగాణకు చెందిన జి.మాధురీ రెడ్డి బాలికల్లో టాపర్‌గా నిలిచింది. 695 మార్కులు పొందిన ఆమెకు జాతీయ స్థాయిలో ఏడో ర్యాంకు లభించింది.

ఢిల్లీకి చెందిన భవిక్‌బన్సాల్ రెండో ర్యాంకు, యూపీకి చెందిన అక్షంత్‌కౌశిక్ మూడో ర్యాంకు సాధించారు. బాలికల క్యాటగిరీలో మధ్యప్రదేశ్‌కు చెందిన కీర్తీఅగర్వాల్‌కు రెండో ర్యాంకు లభించింది. టాప్ 50లో ఏపీకి చెందిన ఖురేషీ అస్రా (ఓబీసీ) పదహారవ ర్యాంకు సాధించింది. ఏపీకి చెందిన పిల్లి భానుశివతేజ 40వ ర్యాంకు, ఎస్ శ్రీనంద్‌రెడ్డి 42వ ర్యాంకు సాధించారు.

ఈ ఏడాది నీట్‌కు 14,10,755 మంది హాజరుకాగా వారిలో 7,97,042 మంది అర్హత సాధించారు. మొత్తం 15,19,375 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ 1,08,015 మంది పరీక్షకు హాజరు కాలేదు. ట్రాన్స్‌జెండర్లు అయిదుగురు పరీక్షకు హాజరు కాగా వారిలో ముగ్గురు అర్హత సాధించారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దేశవ్యాప్తంగా 154 నగరాల్లోని 2,546 కేంద్రాల్లో 11 భాషల్లో జాతీయ అర్హత, ప్రవేశపరీక్షను మే 5, 20వ తేదీల్లో నిర్వహించింది.

- Advertisement -