ఎన్నో అనుమానాలు…అంతకమించి అవమానాలు..2001 టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఉన్న పరిస్థితి ఇది. ఒక్కడితో ఏం సాధ్యమవుతుంది..ప్రత్యేక తెలంగాణ కలే అనే వాదన బలంగా వినిపిస్తున్న రోజులు. ఈ నేపథ్యంలో పట్టుసడలని సంకల్పం,అనుకున్నది సాధించాలనే సంకల్పం గట్టిగా ఉంటే కొండనైనా పిండిచేయవచ్చని నిరూపించారు కేసీఆర్. 14 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక తెలంగాణను సాధించి చూపించిన కార్యదక్షకుడు కేసీఆర్. నేడు తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా సంక్షేమపథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. నాడు ఉద్యమ పార్టీగా నేడు బంగారు తెలంగాణ సాధనలో కీలకమైన టీఆర్ఎస్ ఆవిర్భవించి 18 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి,రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఓ పత్రికకు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ఆశ, ధ్యాస, శ్వాస దేశానికి తెలంగాణ మోడల్ పాలన అందించడమేనని సంతోష్‌కుమార్ పేర్కొన్నారు.ఐదేళ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా మార్చిన సీఎం కేసీఆర్… ప్రపంచమంతా మెచ్చుకుంటున్న తెలంగాణ తరహా పాలనను దేశానికి అందించే ఏకైక లక్షంతో కెసిఆర్ ముందుకు వెళుతున్నారని తెలిపారు. 18 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తొలుత తాము ఉద్యమకారులమని, ప్రస్తుతం ప్రజాసేవకులమని తెలిపారు.
రాజ్యసభ సభ్యుడిగా ఏడాది కాలంలో ఎంతో నేర్చుకున్నానని ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నానని దేశ, రాష్ట్రాల నేతల పాలనను పరిశీలిస్తున్నానన్నారు. ఇంట గెలిస్తేనే రచ్చ గెలుస్తారన్న నానుడికి అనుగుణంగా ముందుగా తాను పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటానని తెలిపారు. సిరిసిల్ల జిల్లా కుదరుపాక తాను పుట్టి పెరిగిన ప్రాంతమని ఆ ప్రాంతం ప్రజల కనీస అవసరాలు తీర్చడమే తన ముందున్న లక్షమని స్పష్టం చేశారు.
దేశం అంతా రైతుబంధును, రైతుబీమా, కళ్యాణలక్ష్మి లాంటి పథకాలను కేంద్రం నుంచి రాష్ట్రాలు అమలు చేస్తున్నాయంటే అది కెసిఆర్ చలవేనని సంతోష్‌కుమార్ తెలిపారు. 5 ఏళ్ల పాలనతోనే దేశాన్ని ఆకర్షించిన కెసిఆర్ మే 23 తరువాత దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించడం ఖాయమని సంతోష్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడంలో భాగంగా కాళేశ్వరం వెట్ రన్ చూసి కేసీఆర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయన్నారు. రైతుల ఆత్మహత్యలు లేని తెలంగాణ ఇకపై కనిపించనుందన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేసిఆర్ అనేక అవమానాలు ఆటుపోట్లు, ఎగతాళిలు ఎదుర్కొన్నారని చెప్పారు. గులాబీ బాస్ ఎంత మొండివాడో అంతగా మానవతావాది అని… చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యార్థుల బలిదానాలను చూసి ఆయన ఎంతో బాధపడిపోయారని చెప్పారు.