వారణాసి నుండి బీజేపీ అభ్యర్థిగా వరుసగా రెండోసారి నామినేషన్ దాఖలు చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. వారణాసి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. మోడీ వెంట బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పలువురు కేంద్రమంత్రులు ఉన్నారు.
అంతకముందు వారణాసిలో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్నారు మోడీ. అక్కడి నుండి కాల భైరవ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అకాలీదల్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్‌కు పాదాభివందనం చేశారు మోడీ. నామినేషన్ సందర్భంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్, రాంవిలాశ్ పాశ్వాన్, ఉద్ధవ్ ఠాక్రే తదితరులు మోడీని అభినందించారు.
2014 సాధారణ ఎన్నికల్లో వారణాసితో పాటు వడోదర నుంచి పోటీ చేసి గెలిచారు మోడీ. అనంతరం వడోదర నుండి తప్పుకుని వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌పై 3 లక్షల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.