కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం కొత్త నోట్లను విత్ డ్రా చేసుకోవడానికి ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ లో ఉన్న ఎస్ బీఐ శాఖకు వచ్చారు. రూ.500, రూ.1000 నోట్లను మార్చుకునేందుకు అప్పటికే ఆ బ్రాంచ్ వద్ద గంటల తరబడి క్యూలో వేచి వున్న చిల్లర బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, ‘రూ.4 వేల పాతనోట్ల మార్పిడి కోసం ఇక్కడికి వచ్చాను. సాధారణ జనంతో పాటుగా క్యూలోనే ఉంటాను’ అని సమాధానమిచ్చారు. నల్లధనం పేరుతో ప్రజలకు మోదీ ప్రభుత్వం నరకం చూపుతోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో అధిక సంఖ్యలో ప్రజలు బ్యాంకులకు చేరుకొని గందరగోళానికి గురవుతున్న అంశంపై భారతీయ రిజర్వు బ్యాంక్ అధికారులు స్పందించారు. కొత్త నోట్లు అందరికీ సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందకూడదని పేర్కొన్నారు. ప్రజలు సహనంతో ఉండాలని, కొత్త నోట్లను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చే పనిలోనే తాము ఉన్నామని చెప్పారు. మరోవైపు కొన్ని ఏటీఎంలు ఈ రోజు మధ్యాహ్నం నుంచి తెరచుకున్నాయి. పలు ఏటీఎంలలో ఉన్న సాంకేతిక సమస్యలను నిపుణులు పరిశీలిస్తున్నారు.