ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకే పరిమితమైన చిరు తెలంగాణలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్నారు.
ఈ నెల 8న తెలంగాణలో పర్యటించనున్నారు కాంగ్రెస్ నేత సోనియా గాంధీ. చేవేళ్లలో జరుగబోయే భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు. సోనియాతో పాటు ఈ సభలో చిరు పాల్గొననున్నట్లు సమాచారం.
చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించనున్నారు చిరు. కొండా విశ్వేశ్వర్ రెడ్డితో చిరు కుటుంబానికి బంధుత్వం ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ప్రచారం చేస్తే తన మైలేజ్ పెరుగుతుందని విశ్వేశ్వర రెడ్డి భావిస్తున్నారు.
ఇక టీఆర్ఎస్ నుండి బరిలో ఉన్నారు వ్యాపారవేత్త రంజిత్ రెడ్డి.2004లో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న ఆయన చేవెళ్లలో ఎస్‌ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరుతో పౌల్ట్రీ పరిశ్రమలను నెలకొల్పారు. చాలా గ్రామాల్ని దత్తత తీసుకొని వేల కుటుంబాలకు మెరుగైన వైద్యం అందింస్తున్నారు. ఆయన నల్లేరుపై నడకే కానుందని టీఆర్ఎస్ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కాకుండా చిరు తెలంగాణలో ప్రచారం చేయడం కొండాకు ఏ మేరకు లాభిస్తుందో వేచిచూడాలి.