సాధారణ ఎన్నికలను తలపించేలా చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో నరేష్ ప్యానల్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. మా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు నరేష్ ప్యానల్‌కు మద్దతు తెలిపిన నాగబాబు వారి విజయంలో కీలకపాత్ర పోషించారు. దీంతో షాక్ అవ్వడం మాజీ అధ్యక్షుడు శివాజీరాజా వంతైంది.
ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌లో నాగబాబుకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని తెలిపిన శివాజీరాజా అందుకు కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నారు. మెగాబ్రదర్ నాగబాబు జనసేన తరపున నరసాపురం నుండి పోటీచేస్తుండగా ఆయన ఇవాళ నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో వైసీపీలో చేరిన శివాజీరాజా..నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారట. వైసీపీ తరఫున క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్త రఘురామకృష్ణంరాజు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. రాజుల ప్రాబల్యం ఎక్కువగా వున్న నియోజకవర్గంలో శివాజీరాజా ప్రచారం వైసీపీకి ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.మొత్తంగా తన ఓటమిలో భాగస్వామిగా ఉన్న నాగబాబును ఓడించడం ద్వారా శివాజీరాజా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నారని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది. శివాజీ రాజా తీసుకున్న నిర్ణయంపై నాగబాబు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.