జనసేనలోకి నాగబాబు..నర్సాపురం ఎంపీగా పోటీ..

322
nagababu janasena
- Advertisement -

కొంతకాలంగా మై చానల్ నా ఇష్టం పేరుతో యూ ట్యూబ్ ఛానల్‌ని ప్రారంభించి టీడీపీ,ఏపీ సీఎం చంద్రబాబు,లోకేష్‌,బాలయ్య పై మెగా బ్రదర్ నాగబాబు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తమ్ముడు పవన్‌పై ఈగ వాలిన సహించని నాగబాబు తనదైన శైలీలో సెటైర్లు వేస్తూ పొలిటికల్ హీట్ పెంచేశారు. ఈ నేపథ్యంలో త్వరలో ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. ఆ వార్తలకు బలం చేకూరేలా నాగబాబు జనసేనలో చేరికకు రంగం సిద్ధమైంది.

పవన్‌ సమక్షంలో జనసేనలో చేరిన నాగబాబును నర్సాపురం లోక్ సభ నుండి బరిలోకి దించుతున్నట్లు ప్రకటించారు.తాను రాజకీయాల్లోకి రావడానికి నాగబాబే స్పూర్తి అన్నారు. తన కుటుంబ సభ్యులను దొడ్డిదారిన కాకుండా డైరెక్ట్ గా తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తన కుటుంబసభ్యులకు సీట్లు కేటాయించని పవన్ తొలిసారి నాగబాబుకు సీటు కేటాయించారు. నాగబాబుకు సీటు కేటాయించడంపై జనసేన వర్గాలు,మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఇటీవల గుంటూరులో జరిగిన కార్యకర్తల సమావేశానికి నాగబాబు హాజరయ్యారు. ఆ తర్వాత జరిగిన రెండు పార్టీ సమావేశాల్లోనూ ఆయన ప్రత్యక్షమయ్యారు. ఈ నేపథ్యంలో కాపు సామాజికవర్గం ఓట్లతో పాటు సినీ గ్లామర్ ఉన్న తన అన్నయ్య నాగబాబును ఎన్నికల బరిలో దించడం ద్వారా పార్టీకి లాభిస్తుందని పవన్ భావించారట. దీనికి తోడు వీరి సొంత జిల్లా కావడంతో కలిసి వస్తుందని భావించారట. ఇక నాగబాబు చిరంజీవి ప్రజారాజ్యం స్ధాపించిన సమయంలోనూ కీలకపాత్ర పోషించారు. చిరు పార్టీ తరపున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.

ఇక మరోవైపు క్రైస్తవ మత ప్రభోదకుడు కేఏపాల్ సైతం నర్సాపురం ఎంపీగా బరిలో దిగనున్నారు. దీంతో నర్సాపురం ఎంపీ ఎన్నిక నాగబాబు వర్సెస్ కేఏపాల్‌గా మారడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -