వివేకా హత్య కేసులో అరెస్టులు..

317
ys viveka
- Advertisement -

హత్యకు గురైన మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. కడసారిగా వివేకా భౌతికకాయాన్ని చూసేందుకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, వైసీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన పార్ధీవ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. పులివెందులలోని వైఎస్‌ రాజారెడ్డి సమాధి పక్కనే వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరోవైపు వివేకా హత్యకు నిరసనగా వైసీపీ ఇవాళ శాంతియుత ఆందోళనలకు పిలుపునిచ్చింది. గాంధీ విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వనుంది. ఇక జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ బృందం ఇవాళ సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి హత్య రాజకీయాల ఫిర్యాదు చేయనున్నారు.

వివేకా హత్యపై ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వివేకానందరెడ్డి ఇంట్లో పనిమనిషి తోపాటు వేల్పులకు చెందిన రాగిపిండి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

వైఎస్ వివేకా హత్య కేసులో వాస్తవాలన్నీ బైటకు తీస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వివేకాను చంపడం వల్ల ఎవరికి లాభం..? వీటన్నింటిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. హత్య వెనుక అసలు దోషులను పట్టుకుంటాం.. సూత్రధారులు, పాత్రధారుల ముసుగు తొలగిస్తాం కుట్రదారులకు తగిన బుద్ధిచెబుతామన్నారు.

కాగా, వైఎస్ వివేవానంద రెడ్డి మొదట గుండెపోటుగా భావించారు… అయితే, పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత హత్యగా తేల్చారు. తల, ఛాతి, చేతి, తొడపై ఇలా ఏడుచోట్ల బలమైన గాయాలను గుర్తించారు. 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించిన వైఎస్ వివేకా.. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు.

- Advertisement -