త్వరలో టీఆర్ఎస్లో చేరబోతున్న మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి,ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలో పాత,కొత్త వారిని కలుపుకుపోతున్నారు. ఇప్పటికే తీగలను కలిసిన సబితా,కార్తీక్ చేవెళ్లలో గులాబీ జెండా ఎగరేసి సీఎం కేసీఆర్‌కి కానుకగా ఇస్తామని ప్రకటించారు.
తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ని కలిశారు కార్తీక్ రెడ్డి. మైలార్దేవుపల్లి ప్రగతికాలనీలోని ప్రకాష్ గౌడ్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు కార్తీక్.తాను టీఆర్ఎస్లో చేరుతున్నానని ఇద్దరం కలిసి పని చేద్దామని కార్తీక్‌రెడ్డి కోరగా ప్రకాష్‌గౌడ్ సాదరంగా ఆహ్వానించి ఆలింగనం చేసుకున్నారు. తన రాజకీయ గురువు ఇంద్రారెడ్డి అని ఆయన కుమారుడైన కార్తీక్‌రెడ్డికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ప్రకాష్‌గౌడ్ తెలిపారు.
అంతకముందు మహేశ్వరం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన తీగలతో అరగంటకు పైగా చర్చించారు సబితా. పలు విషయాలపై మాట్లాడారు. ఇంద్రారెడ్డి కుటుంబానికి, తీగల కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ తామెప్పుడూ పరస్పరం విమర్శలు చేసుకోలేదన్నారు. మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో త్వరలోనే నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరం కలిసిమెలసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. రాజకీయంగా తాము పోటీ చేశాం తప్ప.. తమ మధ్య ఎలాంటి వైషమ్యాలూ లేవని స్పష్టం చేశారు.