అభినందన్ వర్ధమాన్..ఇప్పుడు ఈ పేరే దేశమంతా మార్మోగిపోతోంది. శత్రువుల చేతికి చిక్కి కూడా ధైర్యం సడలని భారత సైనికుడుగా రియల్ హీరోగా దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అభినందన్ ఆత్మస్థైర్యం,గుండె నిబ్బరానికి యావత్ భారతావని సెల్యూట్ చేసింది. ఇక అభినందన్ బయోపిక్ వెండితెరపై ఆవిష్కరించేందుకు బాలీవుడు నిర్మాతలు సిద్ధమవుతుండగా తాజాగా అభినందన్ లైఫ్ హిస్టరీ పాఠ్యాంశంగా రాబోతుంది.
రియల్ హీరో అభినందన్ ధైర్యసాహసాలను పాఠ్యాంశంగా చేర్చాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్తాన్ సైనికులకు చిక్కి, ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా అభినందన్ ప్రదర్శించిన పోరాటపటిమ ప్రశంసనీయం. అది భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలి.అందుకే ఆయన సాహసాన్ని స్కూల్ సిలబస్‌లో చేర్చబోతున్నామని ఆ రాష్ట్ర విద్యాశాఖమంత్రి గోవింద్ సింగ్ దోతస్రా ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల గాథలను కూడా పాఠ్యాంశంగా చేర్చుతామని తెలిపారు.
పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్–16 విమానాన్ని కూల్చివేసి, శత్రుదేశానికి పట్టుబడి కూడా సాహసోపేతంగా వ్యవహరించిన అభినందన్ స్వదేశానికి సురక్షితంగా తిరిగివచ్చిన విషయం తెలిసిందే.