ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ‘ఐటీ గ్రిడ్’ కంపెనీ వ్యవహారం రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. ఏపీ ప్రజల సమాచారాన్ని దుర్వినియోగం చేశారని ఈ కంపెనీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఆధార్ డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి రావడంపై దర్యాప్తు చేస్తున్న తెలంగాణ పోలీసులు. సేవా మిత్ర అనే ఒక యాప్‌ను తయారుచేసి ఈ మొత్తం సమాచారాన్ని అందులో ఉంచారని… తన ఫొటోతో బాటు తన వ్యక్తిగత సమాచారం కూడా ఈ సేవామిత్ర యాప్‌లో ఉన్నదంటూ లోకేష్ రెడ్డి అనే వ్యక్తి హైద్రాబాదులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ గ్రిడ్స్ సంస్థను స్థాపించిన మేనేజింగ్ డైరెక్టర్ దాకవరపు అశోక్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
అశోక్ కోసం తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఫిబ్రవరి 21న అశోక్‌ను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 27న ఐటీ గ్రిడ్స్ సంస్థలో కొంత డేటాను ప్రత్యేక హార్డ్ డిస్కుల్లోకి డౌన్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి అశోక్‌ను మరోసారి ప్రశ్నించాలని ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అశోక్ ఏపిలో ఉన్నాడని తెలిసి 4ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆయన కోసం గాలిస్తున్నారు. స్వచ్చందంగా అశోక్ లొంగిపోవాలని లేదంటే హైకోర్టు నుంచి ఉత్తర్వులు పొంది ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి మరి అదుపులోకి తీసుకుంటామని భావిస్తున్నారు.
తాజాగా మాదాపూర్ లోని ఐటీ గ్రిడ్స్ కంపెనీలో సోదాలు నిర్వహించిన సైబరాబాద్ పోలీసులు కొన్ని ఫైల్స్, ల్యాప్ టాప్ లు స్వాధినం చేసుకున్నారు. ఏపీ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న చంద్రబాబు కొడుకు లోకేష్ చిక్కుల్లో పడొచ్చని తెలుస్తోంది. తమ పార్టీకి చెందిన ప్రజల ఓట్లను తొలగించే కుట్రతోనే ఈ డేటా చొరి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ తమపై కావాలని కుట్ర చేస్తుందన్న చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొట్టారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలకు ఎలా ఇస్తారని మండిపడ్డారు.