బాహుబలి చిత్రంతో నేషనల్ స్టార్‌గా మారిన రానా ప్రస్తుతం పలు భాషలలో విభిన్న కథా చిత్రాలు చేస్తున్నాడు. రీసెంట్గా మహానాయకుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో చంద్రబాబు పాత్రలో కనిపించి సందడి చేశాడు. ఇక గత కొద్దిరోజులుగా రానా ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. రానాకు కంటి సమస్య ఉందని ఆయన తండ్రి దగ్గుబాటి సురేష్ ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని జాతీయ స్థాయి వార్తా సంస్థలు రానా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాలంటూ వదంతులకు తెరలేపాయి.
ఈ వార్తలు విని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యలో వస్తున్న పుకార్లపై తాజాగా రానా స్పందించాడు.. నా ఆరోగ్యం గురించి కొన్నాళ్ళుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. నేను చాలా బాగున్నాను. కేవలం బ్లడ్ ప్రెషర్ (బీపీ)కి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాను. కొద్ది రోజులలో అంతా సెట్ అవుతుంది. మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. కానీ పుకార్లు సృష్టించకండి ఇది నా ఆరోగ్యం మీది కాదు అని ట్వీట్ చేశాడు.