రోడ్డు మీద శవం బోతాంటే భుజం పట్టే సంస్కృతి మనది.. సచ్చిపోయినోళ్ల కాళ్లకి దండం పెట్టి పెద్దలను చేసే సాంప్రదాయం మనది.. ఆకలైతాందని అడుక్కునేటొళ్లస్తే అన్నం పెట్టే భోళా చేయి మనది.. దూపయితాందని నీళ్లడిగితే అంబలి పోసిచ్చి అరుగుమీద గూసుండు మనే మంచితనం మనది. ఊరపిష్కలు పుష్కలంగా తినాలని ఇంటి పైర్లకు వరి పైర్లు కట్టే సక్కటోళ్లం మనం.. మైసమ్మకు ఏటను కోస్తం.. పోశమ్మకు కోడిని కోస్తం.. దయ్యానికి గుడ్డును తింపేస్తం.. మరి ఏమైంది ఈ మనుషులకు.. ఎందుకిట్ల తయారైతర్రు… మనిషిని మనిషి కానని రోజులు ఎందుకచ్చినయి.. అడవి జీవరాశుల కంటే అధ్వాన్నం మనం ఎందుకైతన్నం..
‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు..’ అంటూ అందెశ్రీ రాసిన పాటలు అక్షర సత్యాల్లా కళ్లముందు కనిపిస్తున్నాయి.
ఏదన్నా ఓ కాకికి ఆపదొస్తే కాకుల గుంపంతా సుట్టుముట్టు చేరి కావ్ కావ్ అని ఒర్రి సాటి కాకికి ఆసరా అయిదామని సూస్తుంటయి.. ఏదన్నా చీమ బరువెత్తుతుంటే తతిమ్మ చీమలు కూడా బరువెత్తుకున్న చీమకు సాయం జేస్తయి.. అంతెందుకు… ఎడ్లనో.. బర్లనో చూస్తే.. కండ్లపొంటి నీళ్లు గారుతేనో.. లేవలేక కూలవడుతెనో దగ్గరికిపోయి నాలుకను సప్పరిచ్చుకుంట తోటి జీవికి తోడుగున్నం అని జెప్తయి.. మరీ అన్ని ఉన్నా మనుషులేమో ఆటి కంటే ఆధ్వాన్నం అయిపోతున్నరు లోకంలా..
భూమికి లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాల మీద జీవరాశుల జాడ దొరికిచ్చుకుంటున్న మనం పక్క మనిషి అపాయం తోని గిలగిల కొట్టుకుంటున్న పట్టించుకుంటున్నా ఓపికే లేదు మనకు… ఇప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇదే జరుగుతోంది.
రానురాను మానవ సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. మనుషుల్లో మానవత్వం స్థానంలో మనీతత్వం పెరిగిపోతోంది. కష్టాల్లో ఉన్నవారిని.. ప్రియమైన వ్యక్తుల ప్రాణాలు కోల్పోయి తీవ్ర వేదనలో ఉన్న వారిని ఆదుకునేందుకు కూడా ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. మొన్న ఒడిశా.. నేడు మధ్యప్రదేశ్..ఏ ప్రాంతమైతేనేం.. పాషాణంగా మారుతున్నారు మనుషులు.. మానవత్వాన్ని చంపేస్తున్నారని చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ. కొద్ది రోజుల క్రితమే ఓ ఒడిశా గిరిజనుడు భార్య శవంతో పది కిలోమీటర్లు నడుకుంటు వెళ్లాల్సి రాగా.. కొందరు దుర్మార్గులు తల్లి శవాన్నే ముట్టగట్టి తీసుకెళ్లారు.
ఈ దారుణ ఘటనలు మరువక ముందే మధ్యప్రదేశ్‌లోనూ తాజాగా ఇలాంటిదే ఓ ఉదంతం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలింత భర్తతోపాటు ఆసుపత్రికి వెళ్లేందుకు బస్సెక్కింది. కానీ ఆరోగ్యం విషమించడంతో ఆమె బస్సులోనే కన్నుమూసింది. దీంతో భార్య శవంతోపాటు ఆ వ్యక్తిని మార్గమధ్యంలోనే దింపేశారు. దీంతో చిన్నబోయిన ముఖంతో కంటి నిండా నీరుతో రెండు చేతులపై చంటి బిడ్డను వేసుకొని రోడ్డుపక్కన భార్య మృతదేహాన్ని ఉంచి తన ముసలితల్లితో కలిసి వచ్చిపోయే వాహనాల వైపు అతడు దీనంగా చూడటం మొదలుపెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
దామో జిల్లాలో రామ్ సింగ్ లోధి అనే వ్యక్తి అనారోగ్యానికి గురైన తన భార్య మల్లి బాయి, తన ఐదురోజులపాప, తల్లి సునియా బాయ్ తో కలిసి ఆసుపత్రికి ఓ ప్రైవేట్ బస్సులో బయలుదేరారు.అయితే, మార్గం మధ్యలో ఉండగానే సింగ్ భార్య సునియా చనిపోయింది. దీంతో బస్సు కండక్టర్ వారిని అర్ధాంతరంగా దింపేశాడు. అలా అరగంటపాటు వర్షంలోనే దామోకు 20 కిలో మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో రోడ్డుపక్కన కూర్చున్నారు.
అదే సమయంలో మృత్యుంజయ్ హజారీ, రాజేశ్ పాటిల్ అనే ఇద్దరు న్యాయవాదులు ఆ రోడ్డు గుండా పోతూ వారికి సహాయం చేశారు. పోలీసులకు ఫోన్ చేయగా వారు కేవలం వివరాలు మాత్రమే నమోదుచేసుకొని వెళ్లిపోగా లాయర్లు మాత్రం వారికి ఒక ట్యాక్సీ ఏర్పాటు చేశారు. అనంతరం ఈ విషయం బయటకు రావడంతో ప్రైవేటు బస్సును సీజ్ చేసి.. డ్రైవర్, కండక్టర్ ను అరెస్టు చేశారు.
మంచి తనాన్ని సంపేసుకుని బతుకుతున్న మనుషులం మనం.. దయ, జాలీ, కరుణలను స్వార్ధం మింగేసింది.. మనిషి కోతి నుంచి వచ్చిండని చెప్తరు.. కానీ మనకంటే ఆ కోతులే నయం.. పాణం పోతున్నా పట్టించుకోలేనంత బిజీ అయినం మనం.. తోటి మనిషిని పట్టించుకోని మని సచ్చిన పీనుగు తోని సమానం..