సైబరాబాద్ గచ్చిబౌలిలోని శాంతిసరోవర్ లోని బ్రహ్మకుమారిస్ ఆడిటోరియంలో బాలమిత్ర ప్రారంభ కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డితో కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలమిత్ర లోగో ని లాంచ్ చేసి బ్రోచర్లను విడుదల చేశారు.
మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ ముందుగా అందరికీ అభినందనలు తెలిపారు. బాలమిత్ర ఉపాధ్యాయుల ఎంపిక ఇన్నోవేటివ్ మరియు వినూత్నంగా ఉందన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ చాలా ప్రాముఖ్యత కలిగిందన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు సైబరాబాద్ పోలీసులు పెద్దపీట వేస్తున్నారన్నారు. లైంగిక దాడుల నేపథ్యంలో వారికి అండగా ఉండేందుకు సీపీ సజ్జనార్ అనేక కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. సైబరాబాద్‌లో షీటీమ్స్ బృందాలను పెంచారన్నారు. బాధిత మహిళల కోసం భరోసా కేంద్రాన్ని నెలకొల్పారన్నారు. చిన్నారులపై దాడులు, అకృత్యాలు ను నివారించి వారికి అండగా ఉండి, అక్కున చేర్చుకునేందుకు తాజాగా ‘బాలమిత్ర’ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చిల్డ్రన్ ప్రొటెక్షన్ రైట్స్ అండ్ పెనాలిటీస్ పై సైబరాబాద్ పోలీసులు గైడ్ లైన్స్ ఇస్తారన్నారు. బాలమిత్రలు విద్యార్థులను తమను తాము రక్షించుకునేలా తయారు చేయాలన్నారు.
అనంతరం సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ మాట్లాడుతూ.. అందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్ లు ఏర్పాటు చేసి మహిళల భద్రతకు పెద్ద పీట వేసిందన్నారు. బాలమిత్రలు పిల్లల సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావలన్నారు. అలాగే స్కూళ్లలోని సమస్యలను తెలిపితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. చిన్నారులపై పైశాచికత్వానికి పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయడంతో పిల్లలు వారి సమస్యను ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నారన్నారు. లైంగిక హింసకు గురవుతున్న వారిలో బాలికలతో పాటు, బాలురూ ఉంటున్నారన్నారు. అలాంటి అకృత్యాలను అరికట్టడానికి, బాధితులు తమ బాధలను చెప్పుకోవడానికి ఏర్పాటు చేస్తున్న వేదికే బాలమిత్ర అన్నారు.
వాటీజ్ బ్యాడ్ టచ్.. వాటీజ్ గుడ్ టచ్.. అనేది తెలియజెప్పడంతో పాటు పిల్లల పట్ల తల్లిదండ్రులు, పాఠశాల టీచర్లు ప్రవర్తించాల్సిన తీరుపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. బాలలపై జరుగుతున్న లైంగిక దాడులకు అడ్డుకట్ట వేసేందుకు, పోక్సో చట్టంపై విస్తృతమైన అవగాహన తీసుకురావడం, మంచి, చెడుల గూర్చి పిల్లలకు వివరిస్తూ వారిలో చైతన్యం తీసుకురావడంతో పాటు పాఠశాలల్లో బాలమిత్ర గూర్చి ప్రచారం చేస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో ఒక ఉద్యోగిని(కౌన్సెలర్)ను ఎంపిక చేసి, షీ టీమ్స్‌కు, విద్యార్థులకు మధ్య ఆమెను వారధిగా ఉండేలా అవగాహన కల్పించనున్నామన్నారు. నేరం జరిగిన తర్వాత స్పందించి, నేరస్థులను శిక్షించడం కన్నా… నేరం జరగక ముందే సరైన జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని దీనికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రివెంట్, ప్రొటెక్ట్, ప్రాసిక్యూట్, రిపోర్టు, రిడ్రెస్సెల్, రిహాబిలిటేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ, సెల్ఫ్ ఎస్టీమ్‌ను ప్రాతిపదికగా తీసుకున్నామని తెలిపారు. బాలమిత్రలో టీచర్లదే ముఖ్య భూమికన్నారు.
అనంతరం విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ మరియు షీ టీం ఇన్ చార్జ్ డిసిపి అనసూయ మాట్లాడుతూ.. బాలమిత్ర పిల్లలకు ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ గా పని చేస్తుందన్నారు. బాలమిత్రలు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి చెప్పడం, జెండర్ సెన్సిటైజేషన్, మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించడం, పిల్లల పట్ల జరిగే లైంగిక వేధింపులపై అవగాహన కల్పించడం చేస్తారన్నారు. దీంతో వారికి విద్యార్థి దశ నుంచే సమాజం పట్ల గౌరవం పెరుగుతుందన్నారు. పిల్లలను వేధింపులకు గురిచేసిన వారి వివరాలను పోలీసులకు తెలియజేయకపోతే 2012 పోక్సో POCSO (Prevention Of Children Against Sexual Offences) కింద 6 నెలల జైలు శిక్ష మరియు జరిమానా కట్టాల్సి ఉంటుందన్నారు. పాఠశాలలోని ఉండే ఒక ఉపాధ్యాయుడిని బాలమిత్రగా నియమిస్తామన్నారు. వీరు పిల్లలు, షీ టీం కు మధ్య వారధిగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమవడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర ఉంటుందన్నారు.
అనంతరం మాదాపూర్ డిసిపి వేంకటేశ్వర రావు మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులన్నారు. బాలమిత్ర లు పోలీసులకు విద్యార్థులకు మధ్య సంధానకర్తలుగా పని చేస్తారన్నారు. ఇటీవల చిన్నారుల పట్ల వేధింపులను మనం తరచూ వింటున్నామన్నారు. వాటిని అరికట్టేందుకు సైబరాబాద్ సీపీ గారు బాలమిత్రను తీసుకువచ్చారన్నారు. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
అనంతరం శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు లైంగిక వేధింపులకు గురికావడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. పిల్లలు ఏమైనా సమస్యలుంటే బాలమిత్రలకు తెలపాలన్నారు. బాలమిత్రలు స్కూల్ ట్రాన్స్ పోర్టేషన్, డ్రైవర్ల పూర్వాపరాలను సరి చూడాలన్నారు. ఏమైనా నేర చరిత్ర ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. My vehicle is safe అనే పోలీస్ వెరిఫికేషన్ ఉన్న వాహనాల్లోనే విద్యార్థులను స్కూల్ కి పంపేలా చూడాలని బాలమిత్రలకు సూచించారు. బాలమిత్రలకు ఇచ్చిన కిట్ లో నేషనల్ చైల్డ్ రిలేటెడ్ పాలసీలను అధ్యయనం చేయాలన్నారు.
అనంతరం బాలానగర్ డీసీపీ పద్మజా మాట్లాడుతూ.. పిల్లలు తల్లిదండ్రుల తర్వాత టీచర్లతోనే ఎక్కువ సమయం గడుపుతారన్నారు. పిల్లలకు ఏమైనా సమస్యలుంటే బాలమిత్రలు గుర్తించి పోలీసులకు తెలియజేయాలన్నారు.
డబ్లూసీఎస్ డబ్లూ ఏడీసీపీ ఇందిర మాట్లాడుతూ.. బాధితులు కొన్ని సందర్భాల్లో గోప్యతా దృష్ట్యా వారి సమస్యను పోలీసుల దృష్టికి తీసుకురావడానికి సంకోచిస్తున్నారన్నారు. అయితే ఇది సరికాదన్నారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బాలమిత్ర ఫేస్ బుక్ పేజ్ కోసం balamithra.cyberabad పేజ్ ని ఫాలో కావాలన్నారు. అలాగే ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడానికి balamithra.cyberabad@gmail.com, వాట్సాప్ ఫోన్ నెంబర్ 94906 17444లోనూ ఫిర్యాదు చేయాలన్నారు.
సైబరాబాద్ పోలీస్ కళా బృందాలు నిర్వహించిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి కి మెమెంటో ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్, మాదాపూర్ డిసిపి వేంకటేశ్వర రావు, శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, బాలానగర్ డిసిపి పీవీ పద్మజా, అనంతరం విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ (డబ్లూసీఎస్ డబ్లూ)/ షీ టీమ్ ఇన్ ఛార్జ్ డిసిపి అనసూయ, డబ్లూసీఎస్ డబ్లూ ఏడీసీపీ ఇందిర, సర్వ శిక్ష అభియాన్ సెక్టోరల్ ఆఫీసర్ రాధాపద్మజా, బ్రహ్మకుమారీలు షీలా తదితరులు, యూనిసేఫ్ స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ డేవిడ్ రాజ్, షీ టీమ్ సిబ్బంది, సైబరాబాద్ పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు చెందిన టీచర్లు, విద్యార్థులు, మేధావులు, ఉన్నతాధికారులు, కౌన్సెలర్లు సుమారు రెండు వేల మంది హాజరయ్యారు.