తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌లోకి వలసలు పెరుగుతూనేవున్నాయి. ఇప్పటికే టీడీపీ,కాంగ్రెస్ నుండి నేతలు వరుసగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ నుండి సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. ఈయన టీఆర్‌ఎస్‌లోకి రావడం దాదాపు ఖరారైపోయినట్టేనని, టీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు.
తెలంగాణ అసెంబ్లీ విస్తరణ నేపథ్యంలో సండ్ర వెంకట వీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు బలంగా వినిపిస్తోంది. అయితే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరితే ఖమ్మం జిల్లా నుంచి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేల కేబినెట్‌లో మంత్రి పదవి దక్కకున్నా కీలక పదవి వరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుడిగా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నియామకం రద్దు అయింది. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా సండ్ర నియామకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం నెలరోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సి ఉన్న సండ్ర…ఇంతవరకు బోర్డు సభ్యుడిగా బాధ్యతలు తీసుకోకపోవడంతో పాలక మండలి నుంచి ఆయనను ప్రభుత్వం తొలగించింది.