ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో సర్వేల పేరుతో వైసీపీ ఓటర్లను తొలగిస్తున్నారని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో గవర్నర్‌ను ఆయన కలిశారు. జగన్‌తో పాటు పార్టీనేతలు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
అనంతరం, మీడియాతో మాట్లాడిన జగన్.. ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగిస్తున్నారని, ఓటర్ల జాబితాలో అవకతవకలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆయన పలు విమర్శలు చేశారు. అంతేకాకుండా పోలీస్ అధికారుల పదోన్నతుల విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వైఎస్ జగన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సమావేశంలో గవర్నర్‌తో జగన్ గంటకు పైగా చర్చలు జరిపారు. అయితే ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ ఠాకుర్, ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌రావులను వెంటనే బదిలీ చేయాలని ఇదివరికే కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాను ఢిల్లీలో వైఎస్ జగన్ కోరిన విషయం తెలిసిందే. ఈ విషయాలను గవర్నర్‌కు వివరించినట్టు ఆయన చెప్పారు.