తెలుగు వాళ్ల గుండెల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చెరగని ముద్రవేసుకున్నారు డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి. తన పాదయాత్ర ద్వారా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ తన సంక్షేమ పథకాల ద్వారా ప్రజల గుండెల్లో చెరగని స్ధానాన్ని సంపాదించుకున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో నటించగా ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు మహి వి రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇటీవలె సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.సింగిల్ కట్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ను పొందింది. ఈ సినిమాకు సెన్సార్ అంత సులువుకాదని, ఇబ్బందులు తప్పవని భావించిన వారికి షాకిస్తూ, ‘యూ’ సర్టిఫికెట్ ఇచ్చిన బోర్డు సభ్యులు, సినిమా బాగుందని వ్యాఖ్యానించారట.
ఫిబ్రవరి 8న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా మమ్ముట్టి నటించిన డైరెక్ట్ తెలుగు చిత్రం ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. వై యస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు నటించారు.