నవాజుద్దీన్ సిద్దిఖీ ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే కనిపించే ఈ నటుడు ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ సినిమాలో మెరిశారు. ప్రస్తుతం అభిజీత్ పాన్సే దర్శకత్వం వహించిన ‘ఠాక్రే’ సినిమాలో ఆయన శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే పాత్రలో నటించారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా నవాజుద్దిన్ మీడియాతో మాట్లాడుతూ.. కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించారు.
‘ముంబయికి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం తిరుగుతూన్న సమయంలో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కొత్తిమీర అమ్ముకునేవాన్ని. కొంతకాలం తర్వాత జూనియర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చాయి. నేను అందుకున్న తొలి పారితోషికం రూ.4000. అయితే నాకు జూనియర్ ఆర్టిస్ట్ కార్డు లేకపోవడంతో నాకు అవకాశం ఇప్పించిన కోఆర్డినేటర్ సగం వాటా తీసేసుకున్నాడు.
అయితే నా వద్ద మిగిలిన రూ.1800తో ఆర్టిస్ట్‌గా తొలి అవకాశం వచ్చింది కదా అని సెలబ్రేట్ చేసుకున్నాం. మిగిలిన డబ్బు తిరగడానికే సరిపోయింది. అలా చేతిలో చిల్లిగవ్వ లేకుండా అయిపోయింది. అప్పుడే నాకు డబ్బు విలువ తెలిసొచ్చింది’ అని వెల్లడించారు నవాజుద్దిన్.