ఆర్పీ పట్నాయక్ నటిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం మనలో ఒకడు. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ నిర్మిస్తున్నారు. ‘నువ్వు నేను’ ఫేం అనితా…హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో గానగంధర్వుడు ఏసుదాస్ ప్రత్యేకంగా ఓ పాట పాడటంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఇప్పటికే బ్రోకర్ చిత్రంతో దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్న ఆర్పీ…మనలో ఒకడుతో అలరించాడా లేదా చూద్దాం..
కథ:
హీరో కృష్ణమూర్తి (ఆర్.పి.పట్నాయక్) ఓ కళాశాలలో లెక్చరర్. విద్యార్థుల్ని సొంత పిల్లలుగా భావించే వ్యక్తి. ఆయన భార్య శ్రావణి (అనిత) పిల్లలకి సంగీత పాఠాలు నేర్పిస్తుంటుంది. అయితే, అలాంటి అధ్యాపకుడిపై మీడియా సాయంతో లైంగిక ఆరోపణలు మోపి..అతని ఉద్యోగం పోయేలా చేస్తుంది ఓ విద్యార్థి. దీంతో ఇంట్లో,బయట అంతా కృష్ణమూర్తిని నేరస్తుడిలా చూస్తుంటారు. దీంతో తాను చేయని తప్పు నుంచి కృష్ణమూర్తి ఎలా బయటపడ్డాడు…?మీడియాలో అతని పై ప్రసారం చేసిన వార్తలో నిజముందా..?చివరికి కథ ఎలా సుఖాంతమవుతుందో తెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథ, కథనం,నటీనటులు, ప్రీ క్లైమాక్స్. ఒక తప్పు జీవితాలన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో కళ్లకుకట్టినట్లు చూపే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఆర్పీ పట్నాయక్. అనిత, సాయికుమార్, శ్రీముఖి, నాజర్,తనికెళ్లభరణి.. తమ పాత్రలకి తగ్గట్టుగా చక్కగా ఒదిగిపోయారు. ఆర్పీ లెక్చరర్ కృష్ణమూర్తిగానే కనిపిస్తాడు. ఛానల్ ప్రతాప్ పాత్రలో సాయికుమార్ నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆర్పీ పట్నాయక్ కథని తీర్చిదిద్దిన విధానం, సంగీతం సినిమాకి బలాన్నిచ్చాయి.
మైనస్ పాయింట్స్ :
పతాక సన్నివేశాల వరకు ఆసక్తి తగ్గకుండా దర్శకుడు కథ, కథనాలను తీర్చిదిద్దాడు. అదే సమయంలో కొన్ని లోటుపాట్లు కూడా కనిపిస్తాయి. అసలు తప్పు ఎవరు చేశారన్నది అందరికీ ముందే తెలిసినప్పటికీ నిందితుడిని పట్టుకొనే ప్రయత్నం చివరిదాకా చేయకపోవడమనేది థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి తరచూ గుర్తుకొస్తూనే ఉంటుంది. సెకండాఫ్‌లో సినిమా సాగదీసినట్లు అనిపిస్తుంది. సినిమాకు కీలకమైన క్లైమాక్స్‌లో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది.
సాంకేతిక విభాగం:
సినిమాకి కథే అసలు హీరో. ఆర్పీ పట్నాయక్ కథని తీర్చిదిద్దిన విధానం, సంగీతం సినిమాకి బలాన్నిచ్చాయి.సాంకేతికంగా కూడా సినిమా బాగుంది. తిరుమల్‌నాగ్ మాటలతో పాటు సిద్ధార్థ్ కెమెరా పనితనం, ఎస్.బి.ఉద్ధవ్ కూర్పు కూడా చక్కగా కుదిరాయి.ఆర్.పి.పట్నాయక్, అనితల మధ్య సన్నివేశాలు కూడా కుటుంబ ప్రేక్షకులకు నచ్చేవే. అయితే పతాక సన్నివేశాలు మాత్రం సినిమాని సగటు సందేశాత్మక చిత్రంగా మార్చేశాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
సంగీత దర్శకుడిగా పరిచయమైన ఆర్పీ పట్నాయక్‌లో మంచి దర్శకుడు ఉన్నాడు. ‘బ్రోకర్’ చిత్రంతో ఆ విషయం రుజువైంది. తాజాగా మరోసారి ఆయన మెగాఫోన్ పట్టి మీడియా నేపథ్యంలో ‘మనలో ఒకడు’ తెరకెక్కించారు. సంచలనాల కోసం మీడియా ఏం చేస్తోందో చూపెట్టానంటూ ఆర్పీ పట్నాయక్ చెప్పడంతో ‘మనలో ఒకడు’పై ఆసక్తి ఏర్పడింది. మరి ఆ చిత్రం ఎలా ఉంది? మీడియా గురించి ఆర్పీ ఏం చూపించారు? తదితర విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..
విడుదల తేదీ: 04/11/2016
రేటింగ్: 2.5 /5
నటీనటులు: ఆర్పీ పట్నాయక్,అనిత,శ్రీముఖి
నిర్మాత: గురుజాల జగన్మోహన్
సంగీతం, దర్శకత్వం: ఆర్.పి.పట్నాయక్