తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులతో ఈ నెల 17న అసెంబ్లీ కొలువుదీరనుంది. జనవరి 17వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 17 నుంచి 20వ తేది వరకూ నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించారు. 18న స్పీకర్ ఎన్నిక, 19న గవర్నర్ ప్రసంగం, 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపనున్నారు.
తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్ గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎంపికయ్యారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్ కు కృతజ్నతలు తెలిపారు. చార్మినార్ నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ముంతాజ్ . ఇటీవల శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ముంతాజ్ మహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
మజ్లిస్‌కు ఈ అవకాశం లభించడం ఇది రెండోసారి. ఇదివరలో ఎంఐఎం పార్టీ మాజీ అధినేత, సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ 1984లో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. అప్పటికాయన ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పుడు నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సలావుద్దీన్ ఒవైసీ తర్వాత ఇప్పుడు మజ్లిస్ పార్టీ నుంచి ముంతాజ్‌ఖాన్‌కు ఆ అవకాశం దక్కింది. సాధారణంగా పార్టీలతో నిమిత్తం లేకుండా సీనియర్ ఎమ్మెల్యేలను ప్రొటెం స్పీకర్లుగా నియమిస్తారు.
ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని నియమించాలనేది గవర్నర్‌కు ముఖ్యమంత్రి సిఫారసు చేస్తారు. గవర్నర్ నియమిస్తారు. ముంతాజ్‌ఖాన్ మొదటిసారిగా 1986లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రియాసత్‌నగర్ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1994లో యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అదే నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆయన చార్మినార్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు.