మహేంద్రసింగ్ ధోని తర్వాత టీమిండియాకు అలాంటి నాయకుడు వస్తాడా అన్న సందేహం..?వచ్చినా ఎన్నిరోజులు భారత్‌ను ముందుకునడపగలడు అన్న సందిగ్దం…వీటిమధ్య టీమిండియా పగ్గాలు చేపట్టాడు విరాట్ కోహ్లీ. ఓ వైపు కెప్టెన్‌గా మరోవైపు ఆటగాడిగా రెట్టించిన ఉత్సాహంతో జట్టును పరుగులు పెట్టించాడు. ఎవరు ఉహించని విధంగా జట్టుకు విజయాలనందించాడు. దిగ్గజాల సరసన చేరిపోయాడు.
వరుస విజయాలతో రికార్డులను తిరగరాస్తు చరిత్రలో తనకంటూ ఓ పేజిని రాసుకున్న విరాట్ ఆసీస్ గడ్డపై ఆ జట్టును మట్టికరిపించి శభాష్ అనిపించుకున్నాడు. విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో సౌరవ్ గంగూలీతో కలిసి కోహ్లి సంయుక్తంగా నెంబర్ 1 స్థానంలో నిలిచాడు.
ఇప‍్పటివరకూ విదేశాల్లో 24 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి 11 విజయాలు సాధించాడు. విదేశాల్లో గంగూలీ కెప్టెన్సీలో 28 టెస్టుల్లో భారత్ 11 విజయాలు సాధించగా కోహ్లి మాత్రం 24 టెస్టుల్లోనే ఆ గెలుపు మార్కును చేరుకోవడం విశేషం.
విదేశీ టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విజయాల్ని నమోదు చేసింది భారత్. ఈ ఏడాది నాలుగు విదేశీ టెస్టు విజయాల్ని భారత్ సాధించింది.