కేసీఆర్‌ అంటే ప్రజలకు అత్యంత విశ్వాసం..

259
- Advertisement -

ఎమ్మెల్యే హరీష్‌రావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిద్ధిపేట నియోజకవర్గంలో నుండి భారీ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయాన్ని పురష్కరించుకొని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపథాన నడిపిన కేసీఆర్‌ అంటే ప్రజలకు అత్యంత విశ్వాసమని, ఆయనైతేనే రాష్ట్రాన్ని సుభిక్షం చేయగలరన్న నమ్మకంతోనే గడచిన ఎన్నికల్లో ప్రజలు ఓట్ల వర్షం కురిపించారని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.

MLA Harish Rao

ప్రజల నమ్మకమే కేసీఆర్‌ అఖండ విజయమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రతికార్యకర్త అంకితభావంతో పనిచేశారని, తాను లక్షా 18 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందానంటే అది కార్యకర్తల కృషే అన్నారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలని తెలిపారు. ఎన్నికల్లో అధిష్ఠానం అప్పగించిన బాధ్యతను తాను కూడా చిత్తశుద్ధితో అమలు చేసి విజయంలో తనవంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఇదే స్ఫూర్తి కనిపించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనవసరమైన పట్టుదలలకు పోకుండా గ్రామస్థులంతా కూర్చుని ఐక్యంగా ఓ వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలని, దీనివల్ల డబ్బు, సమయం ఆదా అవుతాయని సూచించారు. గ్రామస్థాయి నుంచి అభివృద్ధి సాధ్యమైనప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.

- Advertisement -