టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అన్నారు కేటీఆర్.జనగామ జిల్లా ప్రెస్టన్ గ్రౌండ్స్‌లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల ఆశీర్వాద సభలో మాట్లాడిన కేటీఆర్..సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టానని తెలిపారు. అద్భుత స్వాగతం పలికిన కార్యకర్తలను ఎప్పుడు మరిచిపోనని తెలిపారు.
మంత్రివర్గంలో జనగామ నుంచి ఒకరికి స్ధానం దక్కుతుందన్నారు. జనగామ జిల్లాలో మెగా,మినీ టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు.
47 ఏళ్ల వయసులో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్…వందసంవత్సరాల కాంగ్రెస్ పార్టీ,నాడు అధికారంలో ఉన్న టీడీపీకి ధీటూగా పార్టీని నిలబెట్టారని తెలిపారు. 14 ఏళ్ల సుదీర్ఘపోరాటం తర్వాత కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించారని గుర్తుచేశారు.
నాడు పార్టీ అధ్యక్షులుగా,నేడు ముఖ్యమంత్రిగా తెలంగాణను బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.నాడు ఉద్యమసమయంలో వరంగల్ ప్రజలు పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. నాటి నుండి నేటి వరకు టీఆర్ఎస్కు ఆయువుపట్టుగా ఉన్న కార్యకర్తలను కంటికి రెప్పాలా కాపాడుకుంటామన్నారు. ఎత్తిన గులాబీ జెండా దించకుండా పోరాడిన కార్యకర్తలకు అండగా నిలబడటమే తనముందున్న లక్ష్యం అన్నారు.
కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ముందుకుసాగుతామని చెప్పారు.నాలుగున్నరేళ్ల ప్రభుత్వ నిర్వహణలో అద్భుత విజయాలను సాధించామన్నారు. దేశమంతా రైతు బంధు,మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ పథకాలను కొనియాడుతున్నాయని చెప్పారు. దేశానికే దిక్సూచిగా కేసీఆర్ నాయకత్వం నిలిచిందన్నారు.
తెలంగాణలో 2 కోట్ల మంది ఓటు వేస్తే అందులో సగం కోటిమంది టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారని చెప్పారు. రాబోయే తొమ్మిదినెలల్లో జనగామ జిల్లాలోని ప్రతి చెరువును నింపుతామని చెప్పారు.గెలవగానే అహంకారం రాకూడడదని ప్రజలను చులకనగా చూడవద్దని నేతలకు సూచించారు.
రాబోయే ఏడు నెలలకు టీఆర్ఎస్ కు కీలకమన్నారు. పంచాయతీ ఎన్నికలు,మున్సిపాలిటీ,పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారని చెప్పారు. ఇప్పట్లో కాంగ్రెస్ నేతలు గడ్డాలు తీసే పరిస్ధితి లేదని ఉత్తమ్ కు చురకలంటించారు.