తాను బెగ్గర్ని కాదని…పోరాట యోధుడినని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. సికింద్రాబాద్ ప్రజా ఆశీర్వాదసభ అనంతరం ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేసీఆర్…కాంగ్రెస్,బీజేపీల వైఖరిని ఎండగట్టారు. జాతీయస్ధాయిలో ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేస్తానని తెలిపారు.
స్టాలిన్,దేవేగౌడ,మమతా బెనర్జీ లాంటి నాయకులతో మాట్లాడనని దేశంలో మార్పుకోసం చేస్తున్న ప్రయత్నాన్ని వారు స్వాగతించారని చెప్పారు. భారతదేశానికి మార్పు అవసరమని… అది హైదరాబాద్ నుంచే ప్రారంభం అవుతుందని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ రెండూ చెడ్డపార్టీలేనని… వాళ్లు అధికారాలను కేంద్రీకృతం చేస్తున్నారని ఆరోపించారు. వాళ్లు చేయాల్సిన పని చేయటంలేదని తాను చాలా స్పష్టతతో ఉన్నానని చెప్పారు. సోనియా అడిగినా సరే ఆమె వెంట వెళ్లేది లేదన్నారు. సోనియాగాంధీ అంత చెడ్డ వ్యక్తి కాదన్న కేసీఆర్.. ఆమె ఉదాత్తురాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము గెలువబోతున్నామని, అది భారీ విజయంగా ఉండబోతున్నదన్నారు.