దీపికాపదుకొణె, రణ్‌వీర్ సింగ్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే గత బుధవారం ఉదయం కొంకణీ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా వారి వివాహ వేడుక జరిగింది. ఇటలీలో లేక్ కోమోలోని డెల్ బాల్బియా నెల్లో రిసార్ట్‌లో ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో దీపిక, రణ్‌వీర్ పెళ్లి జరిగింది. వధూవరులతో పాటు అతిథులు సంప్రదాయ వస్త్రాలు ధరించి సందడి చేశారు. ఈ ఆదివారం ముంబై చేరుకున్న ఈ జంట ఈ నెల 21న బెంగళూరులో, 28న ముంబయిలో వివాహ విందును ఏర్పాటు చేయనున్నారు.
అయితే వీరి వివాహంపై చెలరేగిన వివాదం వారిని ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తుంది. దీప్ వీర్ వివాహం తర్వాత నిర్వహించిన ‘ఆనంద్ కరాజ్’ అనే కార్యక్రమం సంప్రదాయ బద్దంగా జరగలేదని ఇటాలియన్ సిక్ ఆర్గనైజేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సిక్కు సంప్రదాయాలకి విరుద్దంగా ఆ కార్యక్రమం జరుగగా, సిక్కుల కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి మరీ దానిని నిర్వహించారని పేర్కొంది.
సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘గురు గ్రంథ్ సాహిబ్’ను గురుద్వారాలో తప్ప మరెక్కడా తీసుకోకూడదని, కాని వారు ఆ నియమాన్ని ఉల్లంఘించారని పేర్కొంది. ఈ విషయాన్ని ‘అకల్ తఖ్త్ జతేదార్’ దృష్టికి తీసుకెళ్లినట్టు సంస్థ అధ్యక్షుడు తెలిపారు. ఈ విషయాన్ని ఐదుగురు మత గురువుల వద్దకు విషయాన్ని తీసుకెళ్లనున్నట్టు అకల్ తఖ్త్ జతేదార్ తెలిపారు. మరి ఈ వివాదంపై దీపికా, రణ్‌వీర్‌లు ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.