గాలి జనార్దన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన సీసీబీ..

255
- Advertisement -

మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిని సీసీబీ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఓ లంచం కేసులో మూడు గంటల పాటు ఆయనను ప్రశ్నించిన పోలీసులు.. తర్వాత అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో మూడేళ్లపాటు జైల్లో గడిపిన గాలి.. ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో అధికారులు శనివారం రాత్రి గాలి జనార్దన్‌రెడ్డిని మూడు గంటలకుపైగా ప్రశ్నించారు.

ఈ కేసుకు సంబంధించి విచారించడానికి పోలీసులు మూడు రోజులుగా ప్రయత్నించినా.. ఆయన ఆచూకీ తెలియలేదు. బెంగళూరు వదలి పారిపోయారని, హైదరాబాద్‌లో తలదాచుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే తానెక్కడికీ పారిపోలేదని, మూడు రోజులుగా బెంగళూరులోనే ఉన్నట్లు గాలి జనార్దన్ చెప్పారు.

నిన్న మధ్యాహ్నం 4 గంటల నుంచి అర్ధరాత్రి 3గంటల వరకు ఏకధాటిగా గాలిని విచారించిన సీసీబీ పోలీసులు ఆదివారం ఉదయం 9గంటల నుంచే మళ్లీ ఆ ప్రక్రియను ప్రారంభించారు. ఈ విచారణకు హాజరైన అంబిడెంట్ ఎండీ ఫరిద్, జనార్దన్‌ రెడ్డి పీఏ అలీఖాన్‌ను బయటకు పంపినా జనార్దన్‌ రెడ్డిని సీసీబీ కార్యాలయంలోనే ఉంచారు.

Gaali Janardhana Reddy

ఒంటరిగా ప్రశ్నించిన సందర్భంలో ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని చెప్పిన గాలి.. ఫరిద్ ఎదురుగా ఉన్నప్పుడు మాత్రం తాను సాయం చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. సుదీర్ఘ విచారణ తర్వాత సీసీబీ పోలీసులు గాలి జనార్దన్‌ రెడ్డి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. విచారణలో జనార్దన్‌ రెడ్డి పోలీసులను అస్తవ్యస్తమైన సమాధానాలతో తికమక పెట్టినట్లు సమాచారం.

ఈ కేసుకు సంబంధించి ఆదివారం ఆయనతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు విచారించారు. గాలి సూచన మేరకు రూ.18కోట్ల నగదును ఆర్టీజీఎస్ రూపంలో బదిలీ చేసేందుకు సహకరించిన బెంగుళూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి బ్రిజేష్ రెడ్డి, ఫైజల్, జయరాంలను పోలీసులు ప్రశ్నించారు. ఈ విచారణ ప్రక్రియను 300పుటల్లో రాతపూర్వకంగా, వీడియో చిత్రీకరణ ద్వారా భద్రపరచారు. అనంతరం ఐపీసీ 120బి, 201 సెక్షన్ల కింద గాలిని అరెస్ట్ చేశారు. కేసును దారి తప్పించేందుకు కుట్ర పన్నడం, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించిన అభియోగంపై గాలిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

- Advertisement -