వరుస రికార్డులతో దూసుకుపోతున్న టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలే కరీబియన్‌పై పరుగుల సునామీ సృష్టించిన విరాట్ కెరీర్లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌తో 5 వన్డేల సిరీస్‌ను 3-1తో టీమ్ఇండియా సొంతం చేసుకొని సత్తాచాటింది. గురువారం తిరువనంతపురంలో జరిగిన చివరి ఐదో వన్డేలో విండీస్‌పై 9 వికెట్ల తేడాతో గెలిచిన కోహ్లీసేన ట్రోఫీ అందుకుంది. అయితే భారత్, విండీస్ మధ్య వన్డే సిరీస్‌తో పాటు శ్రీలంక, ఇంగ్లాండ్.. బంగ్లాదేశ్, జింబాబ్వే మధ్య సిరీస్‌లు ముగిసిన నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది.
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీ ఐదు మ్యాచ్‌లలో మొత్తం 453 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కైవసం చేసుకున్నాడు. ఇందులో మూడు శతకాలున్నాయి. వన్డే క్రికెట్లో అతనికిది ఏడో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కావడం విశేషం. తద్వారా ఇప్పటికే ఈ ఘనత సాధించిన భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ(7), యువరాజ్ సింగ్(7) సరసన కోహ్లీ వచ్చి చేరినట్లయింది. వీరితో పాటు వన్డేల్లో ఏడు మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో వీరితో పాటు వివ్ రిచర్డ్స్(వెస్టిండీస్), రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా), హసీమ్ ఆమ్లా(దక్షిణాఫ్రికా) ఉన్నారు.
అయితే వన్డే క్రికెట్లో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో సచిన్(15) అందరికంటే ముందున్నాడు. అతని తర్వాత శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య(11), షాన్ పొల్లాక్(9) ఉన్నారు. ఈ సిరీస్‌లో కోహ్లీ తొలి వన్డేలో 140పరుగులు, రెండో వన్డేలో 157, మూడో వన్డేలో 107, నాలుగో వన్డేలో 16 పరుగులు సాధించాడు. ఇక తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి వన్డేలోనూ కోహ్లీ(33నాటౌట్; 29బంతుల్లో 6×4) రాణించి సిరీస్ మొత్తంగా 453పరుగులు సాధించాడు.