తెలంగాణలో స్థిరపడిన ఇతర ప్రాంతాల ప్రజల బాధ్యత తాను స్వయంగా తీసుకుంటానని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల ప్రజలతో నిజాంపేటలో జరిగిన మన హైదరాబాద్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, తమ ప్రభుత్వం అందించిన సుపరిపాలనలో హైదరాబాద్లో స్థిరపడిన ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రజలందరి సహాకారంతోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ విజయ ఢంకా మోగించి జీహెచ్ఎంసీ పీఠంపై గులాబీ జెండా ఎగరేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా ఎటువంటి హింసకు తావులేకుండా తమ పాలన సాగిందని, రాష్ట్రంలో ఏ ఒక్క రోజు కూడా ఎక్కడా కర్ప్యూ నిర్వహించిన సందర్భాలు లేవని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని, తమ పాలనకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని, ఆంధ్రా ప్రజలు కూడా టీఆర్ఎస్ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.
రాజకీయాల కారణంగానే ఆంధ్రా నాయకులపై విమర్శలు చేస్తున్నామని, తెలంగాణ ప్రాంతంపై ఆధిపత్యం చలాయించాలని చూస్తున్న చంద్రబాబును తాము విమర్శిస్తున్నామని, కానీ ఆంధ్రా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే బాధ్యత తనదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించిన చంద్రబాబుపై తమ పోరాటం కొనసాగుతోందని, చంద్రబాబునాయుడిని ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కొంటామని, ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలో పూర్తిగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి తన డబ్బు సంచులతో ఆక్సిజన్ అందించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలుగు రాష్ట్రాలకు జాతీయ పార్టీలు తీరని అన్యాయం చేశాయని మండిపడ్డారు మంత్రి కేటీఆర్.