టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కు ఐటీ ఉచ్చు బిగుస్తోంది. సీఎం రమేష్ కు సంబంధించిన ఇళ్లు, వ్యాపార సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, కడప, విజయవాడ, తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి చేపట్టిన సోదాల్లో భాగంగా.. ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు.
అయితే.. ఐటీ దాడులను సీఎం రమేష్ ఖండించారు. కేంద్రాన్ని నిలదీసినందుకే తన ఇళ్లలో తనిఖీలు చేపట్టారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలపై పార్లమెంట్ లో మోడీ ప్రభుత్వాన్ని నిలదీసినందుకే తనపై కుట్రపూరితంగా ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఐటీ శాఖను అడ్డం పెట్టుకుని తమను మోడీ ప్రభుత్వం వేధించాలని చూస్తోందని.. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఎవరెన్ని చేసినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడేదే లేదని సీఎం రమేష్ వెల్లడించారు.