కాంగ్రెస్-టీడీపీలపై నిప్పులు చెరిగిన కేసీఆర్‌..

276
- Advertisement -

పాలమూరు అభివృద్ధికి అడుగడుగునా కాంగ్రెస్ నాయకులు చిన్నారెడ్డి, డీకే అరుణ అడుగడుగునా అడ్డుపడ్డారని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెరాస భారీ బహిరంగ సభ నిర్వహించింది. వనపర్తి వేదికగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు తెరాస శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ‌మాట్లాడుతూ… కాంగ్రెస్‌, తెదేపాల పాలనను ఎండగట్టారు. కాంగ్రెసోళ్లు గొర్రెలు అని ఎద్దెవా చేశారు కేసీఆర్‌.వనపర్తి నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి.. గొర్రెలు, చేపల పిల్లలకు ప్రయత్నం చేస్తా ఉంటే.. అసెంబ్లీలో ఆయన విమర్శించారు.

KCR

యాదవులు మీ దృష్టికి కనిపించలేదా? చేపలు పెంచే మత్స్యకారులు మీ కంటికి కనిపించలేదా? ఈ కాంగ్రెస్ గొర్రెలకు గొర్రెలు కనిపించలే? రాష్ట్రంలో 30 లక్షల మంది గొల్లకుర్మలు ఉన్నారు. 2014లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన నాడు 650 లారీల గొర్రెలు ప్రతీ రోజు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి అయ్యేవి. ఇదంతా అంతకుముందు ఉన్న పాలకులకు తెలివి లేకా? దీన్ని దూరం చేయాలని 65 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం. 35 లక్షల గొర్రెలు పుట్టాయి. 15 వందల కోట్ల సంపదను సృష్టించారు.

దేశంలోనే తెలంగాణ గొల్లకుర్మలు ధనవంతులు కాబోతున్నారు. 40 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. శ్రీశైలంలో చేపలు పట్టబోతే ఏపీ వాళ్లు తరిమికొట్టారు. వెయ్యి కోట్లతో చేపలు పెంచుతున్నాం. చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయి. గీతా కార్మికులను ఆదుకుంటున్నాం. నాయిబ్రహ్మణ, రజకుల విషయంలో నవీనమైన పద్ధతులను అవలంభిస్తున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తామని కేసీఆర్ హామీనిచ్చారు. 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే.. తర్వాత వచ్చే ఎన్నికల్లో(ఇప్పుడు వచ్చే ఎన్నికలు కావు) ఓట్లు అడగనని శపథం చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఒక్క కేసీఆర్ కావాలి. వాస్తవాలను గ్రహించాలి. ఆరునూరైనా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశాం. ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాం. ఈ నాలుగున్నరేండ్లలో రూ. 9 వేల కోట్లు ఖర్చు పెట్టి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశాం. తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాం.

KCR

నికర జలాలు, మిగులు జలాలను వినియోగించుకుంటాం. ఎలక్షన్లు అయిపోగానే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా 40 రిజర్వాయర్లు కడుతాం. ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాల పాత ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం. మరో 12 లక్షల ఎకరాలకు పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి నీరందిస్తాం. మొత్తంగా 20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే బాధ్యత తీసుకుంటాం. 14 సీట్లలో టీఆర్‌ఎస్‌ను గెలిపించండి.. 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే మళ్లీ ఓట్లు అడగనని చెబుతున్నాను అని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పాలమూరు జిల్లాను చంద్రబాబు.. 9 సంవత్సరాలు దత్తత తీసుకొని కూడా ఏం చేయలేదన్నారు కేసీఆర్. గుండెల మీద గుద్దిండు.. తప్ప ఏం చేసింది లేదు.. అభివృద్ధి పేరిట జిల్లాలో సమైక్య పాలకులు పాతిన రాళ్లు తీసుకుపోయి.. కృష్ణా నదిలో వేస్తే పెద్ద డ్యాం అవుతుంది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నీచాతి నీచంగా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంది. ఇవాళ ఆంధ్రోళ్లకు అధికారం ఇస్తామా? తెలంగాణ నిర్ణయాలు ఢిల్లీలో జరగాలా? తెలంగాణలో జరగాలా? ప్రజలు ఆలోచించాలి.

ఢిల్లీ గులాంలు.. అమరావతి గులాంలు కావొద్దు. కాంగ్రెస్, టీడీపీకి ఓటేస్తే.. ఇన్నేండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గద్దల పాలవుతుంది. పాలమూరు ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. చంద్రబాబు మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్ ఒక్కటైండ్రు అంటుండు. ఓటుకు నోటు దొంగతనం చేసింది నిజం కదా? ఓ బుడ్డెరఖాన్ దొరికే. తెలుగు పేరు మీదనే మా కొంపను ముంచిండ్రు. దోసుకున్నారు. చంద్రబాబు నీతో పొత్తా.. ఛీ.. ఛీ.. నీ అడుగుపడితే పచ్చని చెట్టు కూడా భస్మం అవుతది. మహాకూటమి సంగతిని ప్రజలే తేలుస్తారు. నీ దమ్ము ఏందో.. మా దమ్మేందో ఎన్నికల్లో తేల్చుకుందాం. పాలమూరు పనులు ఆగవద్దు. అభివృద్ధి ఆగొద్దు.. అద్భుతమైన పాలమూరు తయారు కావాలి అని సీఎం కేసీఆర్ చెప్పారు.

- Advertisement -