ఆసియా కప్‌ భారత్‌ దే…

248
India beat Bangladesh by three wickets
- Advertisement -

ఏడోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. దుబాయ్ వేదికగా హోరాహోరిగా సాగిన పోరులో భారత్‌ మూడు వికెట్ల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది.ఒత్తిడిని జయిస్తూ, ఉత్కంఠను అధిగమిస్తూ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్ మరోసారి టైటిల్‌ని తన ఖాతాలో వేసుకుంది.

బంగ్లా విధించిన 223 పరుగల లక్ష్యఛేదనలో భారత్‌ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్లు రోహిత్‌, ధావన్‌ బ్యాట్లు ఝుళిపించడంతో భారత్‌ లక్ష్యఛేదన ధాటిగానే ఆరంభమైంది. 4.3 ఓవర్లలో స్కోరు 35. దీంతో భారత్ అలవోకగా గెలుస్తుందనుకుంటున్న తరుణంలో బంగ్లా బౌలర్లు అద్భుతంగా రాణించారు. 11 పరుగుల వ్యవధిలోనే ధావన్‌ (15), రాయుడు (2) వికెట్లను చేజార్చుకుంది.

తర్వాత రోహిత్ కూడా పెవిలియన్‌ బాటపట్టారు. దీంతో జట్టును ఆదుకునే బాధ్యతను దినేష్ కార్తిక్,ధోని భుజాన వేసుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో ధోని ఔట్‌ కావడం, జాదవ్‌ కండరాలు పట్టేసి పరుగెత్తలేని స్థితిలో ఉండడంతో భారత్‌ ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత బంగ్లా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడి పెంచారు. చివరి 11 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో కుల్‌దీప్‌ (5 నాటౌట్‌)తో కలిసి జట్టుకు విజయాన్నందించాడు జాదవ్. రోహిత్‌ శర్మ (48), దినేశ్‌ కార్తీక్‌ (37), ధోని (36), కేదార్‌ జాదవ్‌ (23 నాటౌట్‌), జడేజా (23), భువనేశ్వర్‌ (21) రాణించడంతో భారత్ విజయతీరాలకు చేరింది.

అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. తొలివికెట్‌కు 120 పరుగుల జోడించారు. ముఖ్యంగా ఓపెనర్ లిటన్ దాస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కెరీర్లో తొలిసెంచరీ సాధించిన దాస్ 117 బంతుల్లో 121 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడంతో ఓ దశలో 300 పరుగులు దాటుతుందని అంతా భావించినా భారత బౌలర్లు రాణించడంతో 222 పరుగులకే ఆలౌటైంది. లిటన్‌ దాస్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా, శిఖర్‌ ధావన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా ఎంపికయ్యారు.

- Advertisement -