అస్వస్థతకు గురై నెల రోజులుగా చెన్నైలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న ఏఐఏడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం తన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై వేలిముద్రలు వేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై సదరు పార్టీ చీఫ్ సంతకం చేయాల్సి ఉంటుంది. అరవకురిచ్చి, తంజావూర్, తిరుప్పరంకుంద్రం అసెంబ్లీ స్థానాలకు పోటీచేస్తున్న తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై పార్టీ అధినేత్రి ఎడమచేతి వేలిముద్ర వేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత సంతకంతో కూడిన పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్ధులు ఫారం ఎ, ఫారం బి పూర్తిచేయాలి. పార్టీ తరఫున ఎన్నికల గుర్తును పొందుతున్నట్లు ఫారం ఎ, ఎన్నికల అధికారికి తెలియచేస్తుంది. ఇందులో పార్టీ అధినేత వివరాలు కూడా ఉంటాయి. అలాగే ఫారం బి ద్వారా సదరు అభ్యర్థి తమ పార్టీ తరఫున పోటీచేస్తున్నారని తెలిపే ద్రువీకరణ పత్రం. ఈ రెండింటిపైనా పలు చోట్ల జయలలిత సంతకాలు పెట్టవలసి ఉంది. దీంతో వైద్యుల సమక్షంలో జయలలిత వేలిముద్రలను స్వీకరించారు.
తమిళనాడులోని మధుర జిల్లా తిరుపారంగుండ్రం అసెంబ్లీ స్థానానికి నవంబర్ 9న ఉపఎన్నిక జరగనుంది. దాదాపు 40 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించి వారం కిందట చివరి హెల్త్ బులిటెన్ వెల్లడించిన వైద్యులు.. ఆమె కోలుకుంటున్నదని చెప్పారు. ట్రెకియోటెమి విధానంలో జయ కుడిచేతి గుండా కృత్రిమ నాళాలను వేసినందువల్లే ఆమె సంతకం చేయలేకపోయారని, ఎడమచేతి వేలిముద్రలు తీసుకున్నామని అధికారులు ఎలక్షన్ కమిషన్ కు తెలిపారు. వేలిముద్రలు జయలలితవేనని మద్రాస్ మెడికల్ కాలేజీ నిపుణులు కూడా నిర్ధారించడంతో ఈసీ.. వేలిముద్రలున్న ఏకే బోస్ నామినేషన్ పత్రాలను స్వీకరించింది. మరికొన్ని రోజులు ఆమె ఆసుపత్రిలోనే ఉంటారని తెలుస్తోంది.