దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఈ చిత్రాన్ని భారీ తారాగణంతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలోని పాత్రలపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. బసవతారకంగా విద్యా బాలన్, నారా చంద్రబాబునాయుడిగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్.. తదితర పాత్రల గురించి అధికారికంగా వెల్లడించారు. అయితే ఇందులో యన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిగా ఎవరు కనిపించనున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాత్రలో విజయవాడకు చెందిన ప్రముఖ నృత్య కారణి హిమన్సీ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారట. అంతేకాదు, పురందేశ్వరి గెటప్‌లో ఉన్న హిమన్సీ ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో పురందేశ్వరి పక్కన నిల్చుని… హిమన్సీ నవ్వులు చిందిస్తున్నారు. ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే… చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకు వేచి చూడాల్సిందే మరి.