అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న తరుణంలో మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఒబామా తన పదవీకాలం ముగిశాక ఏం చేస్తారు? ఆయన ఎక్కడుంటారు? ఆయన కెరీర్ ప్లాన్స్ ఏంటి ? అధ్యక్ష పదవి చేపట్టి ప్రజా సంక్షేమానికి దేశానికి శాసనాలు చేస్తూ అంతర్జాతీయ వేదికపై మహారాజులా ఎనిమిదేళ్లు పాలన సాగించిన ఒబామా భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న చర్చ మొదలైంది.
పదవీకాలం ముగింపు దశకొచ్చిన నేపథ్యంలో తన భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారట ఒబామా. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు న్యాయవాదిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఇప్పుడు ఏదైన కంపెనీకి సలహాదారుగా వ్యవహరించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఒబామా సన్నిహితులు చెబుతున్నారు. సిలికాన్ వ్యాలీలోని టెక్ సంస్థల్లోకి ఆయన చేరే అవకాశం ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గత సంవత్సర కాలంగా ఒబామా ప్రెసిడెన్షియల్ ఫౌండేషన్ దాదాపు 10 సార్లు పలు సాఫ్ట్ వేర్ సంస్థలతో సంప్రదింపులు జరిపింది. ఒబామా భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తోంది. అదీకాకుండా ఒబామా వైట్ హౌస్ లో పనిచేసిన ఉన్నతాధికారుల్లో పలువురు ఈ టెక్ సంస్థల్లో పనిచేస్తున్నారు. వన్ టైమ్ మీడియా కార్యదర్శిగా పనిచేసిన జే కార్నే ప్రస్తుతం అమేజాన్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఒబామా ప్రెసిడెన్సీలో పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీలో పనిచేసిన లీసా జాక్సన్ ఆపిల్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు. వీరంతా ఒబామా ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయంగా విరాళాలు ఇచ్చారు. వారు ఒబామాకు అత్యంత సన్నిహితులు. వారితో పాటూ ఒబామా పరిపాలనా విభాగంలో సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటివ్స్ చాలా మంది పనిచేశారు.
ఈ నేపథ్యంలో ఒబామా సిలికాన్ వ్యాలీలో పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తూ.. ఈ నెల పిట్స్ బర్గ్ యూనివర్సిటీలో ఉబెర్ సంస్థ నిర్వహించిన అంతరిక్ష పరిశోధనలపై జరిగిన కార్యక్రమంలో తనకు తెలిసిన సైన్స్ పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు ఒబామా. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఉబెర్ తర్వాతి మార్కెట్ అంతరిక్షమేనన్నారు. ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో క్యాబ్స్ వస్తున్నట్లు – అంతరిక్షంలో వెళ్లాలనుకుంటే ఐదు నిమిషాల్లో ఉబెర్ స్పేస్ షటిల్స్ మీ ముందుంటాయని హాస్యం ప్రదర్శించారు. తన పదవీకాలం ముగుస్తోందని తాను కూడా ఏదో ఒక పని చూసుకోవాలని ఆయన ఆయన ఈ సంధర్భంగా అన్నారు . శక్తివంతమైన మెడికల్ పరికరాలు,అత్యాధునిక బ్యాటరీలు తయారు చేసే పరిశ్రమలకు అడ్వకేట్ ఇన్ చీఫ్ గా పనిచేయాలనుకుంటున్నానని తన మనసులో మాట చెప్పారు. తాను ఇంకా యువకుడినే అని హిల్లరీ కంటే ఒక్క సంవత్సరం మాత్రమే పెద్దవాడినని అన్నారు. ఎనిమిదేళ్ల పాటు అగ్ర రాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్న ఒబామాను పలు కంపెనీలు ఆహ్వానాలు పంపుతున్నాయట.
వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ నాటికి ఒబామా రెండవ టర్మ్ పూర్తి అవుతుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక్కరు రెండుసార్ల మాత్రమే ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది….అంటూ ఒకవేళ నేను మూడో సారి ప్రెసిడెంట్ రేసుకు పోటీపడితే, మిషెల్ నాకు డైవర్స్ ఇవ్వడం ఖాయమని ఒబామా ఓ టీవీ షోలో నవ్వులు పూయించారు.