బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక’. ఈ చిత్రం ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పుడు ఈ సినిమాకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకున్నాడు. దీంతో ఆ బాధ్యతను కంగనా తీసుకుంది. ఆ క్రమంలోనే సోనూసూద్‌తో గొడవొచ్చింది. అది నచ్చని సోనూ నీకు… నాకు కుదరదంటూ తప్పుకున్నాడు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఇప్పటికే సినిమా బాగా ఆలస్యమైంది. అనివార్య కారణాల వల్ల ముందు నుంచి షూటింగ్ ప్లానింగ్ ప్రకారం జరగకపోవడంతో ఖర్చు అంతకంతకు పెరిగిపోతోంది. ఇది నిర్మాతలకు సమస్యగా మారింది. ఇప్పుడు మరో సమస్య వచ్చిపడింది. ఈ ప్రాజెక్టు నుంచి నిర్మాత సంజయ్ కుట్టి కూడా తప్పుకొన్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పుడు ప్రాజెక్టును కొత్త నిర్మాతలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వివిధ కారణాల వల్ల షూటింగ్ వాయిదాలు పడటంతో బడ్జెట్ పెరిగిన కారణంగా నిర్మాతలు ప్రాజెక్టును వద్దు అనుకున్నట్లు తెలుస్తోంది. రూ.70 కోట్లతో అనుకున్న బడ్జెట్ ఇప్పుడు రూ.100 కోట్లు అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్రం విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని హిందీతోపాటు తెలుగులోనూ చిత్రీకరిస్తున్నారు.