ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో భారత బౌలర్లు పట్టుబిగించారు. తొలిరోజు ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్‌కు చుక్కలు చూపించారు. పేస్ బౌలర్లు ఇషాంత్,బుమ్రా రెచ్చిపోయారు. భారత పేస్ ద్వయం ధాటికి సిరీస్ గెలుపుతో మంచి ఊపు మీదున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు తడబడ్డారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి 7 వికెట్లు కొల్పోయి 198 పరుగులు చేసింది.
అంతకముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్నిచ్చారు. ఓపెనర్ జెన్నింగ్స్(23)తో తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించిన కుక్…మొయిన్ అలీ(50)తో 73 పరుగులు జోడించాడు. అలీతో కలిసి క్రీజులో పాతుకుపోయిన కుక్ కొరకరాని కొయ్యలా మారాడు. ఓ వైపు సహచరులు వెనుదిరుగుతున్న కుక్ మాత్రం అడ్డుగోడలా నిలబడ్డాడు.
71 పరుగులతో రాణించి ఇంగ్లాండ్ 200 పరుగులకు చేరువకావడంలో కీలకపాత్ర పోషించాడు.
ఒకానొక దశలో 133/3తో నిలిచిన ఇంగ్లాండ్ తర్వాత తడబడింది. బెయిర్‌స్టో (0) ,స్టోక్స్ (11),కరన్ (0) పెవిలియన్‌కు చేరడంతో ఇంగ్లాండ్ 181/7తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇంగ్లాండ్ చివరి మూడు వికెట్లు 10 నిమిషాల వ్యవధిలో పడడం విశేషం. ప్రస్తుతం బట్లర్ (11), రషీద్ (4)తో కలిసి క్రీజులో ఉన్నాడు. రెండోరోజు భారత బౌలర్లు ఎంత త్వరగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిస్తారన్నదే కీలకం.