తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తారనే ప్రకటన ఊపందుకుంటున్న తరుణంలో ప్రగతి భవన్ అప్‌డేట్స్‌పై ప్రజల్లో మరింత ఆసక్తి రేకెత్తుతోంది. ఇవాళ మంత్రివర్గ సమావేశం ఉంటుందని, ఆ తర్వాత మంత్రి వర్గ నిర్ణయం మేరకు సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని, ఆ తర్వాత సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ దగ్గరికి వెళ్లి మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన నిర్ణయ పత్రాన్ని గవర్నర్‌కు అందజేస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉదయం మంత్రులందరికి ఫోన్లు వెళ్లాయని, మధ్యాహ్నం 12 గంటలకల్లా ప్రగతి భవన్‌కు రావాలని ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది. నిన్న సాయంత్రమే ఫామ్ హౌజ్ నుంచి ప్రగతి భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో రాత్రి వరకు చర్చలు జరిపారని తెలుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి సీఎం క్యాంపు ఆఫీస్‌కు అధికారుల తాకిడి ఎక్కువైంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎప్పుడైనా మంత్రి వర్గ సమావేశం జరగవచ్చనే చర్చ సాగుతోంది. మంత్రి వర్గ సమావేశంలో మంత్రులతో చర్చించి సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.