ఒకప్పుడు బ్లూ వేల్ అంటూ వచ్చిన ఓ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. ఎవరు ఆడమంటారో తెలీదు.. ఎవరితో ఆడుతున్నామో తెలీదు. కానీ చివరికి ఆట ముగింపు మాత్రం మన ప్రాణం పోవడమే. ఇలాంటి ఆటలు ఎవరు ఆడతారు.. అని కొందరు కొట్టి పారేయొచ్చు. కానీ ఆ ఆట వల్ల చనిపోయిన వారి సంఖ్య వందలను దాటి వేలకు చేరుకుందంటే అతిశయోక్తి కాదు. మనదేశం లో కూడా ఈ గేమ్ ఆడి చాలామంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాంతో మన దేశంలోనే కాక చాలా దేశాల్లో ఈ గేమ్ ను నిషేధించారు. ఈ మధ్య కాలం లో బ్లూ వేల్ దుష్ఫలితాలు చాలా తగ్గుముఖం పడుతుండగా మరో గేమ్ మనుషుల ప్రాణాలతో ఆడుకోవడానికి ఇంటర్నెట్ లోకి అడుగుపెట్టింది. అదే “మోమో ఛాలెంజ్”.
గతం లో బ్లూ వేల్ గేమ్ తరహాలోనే ఈ ఆటలో కూడా కొన్ని ప్రాణాంతకమైన టాస్క్ లు ఉంటాయి. ఆట మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ముగించడం అనేది ఉండదు. మీరు ఆడడానికి సిద్ధం అన్నప్పుడు మీ ఆటను గమనించే అడ్మిన్ మీకు ఒక్కో టాస్క్ ని మీ వాట్స్ ఆప్ కి పంపిస్తాడు. మీరు ఏ మాత్రం వ్యతిరేకించినా. మీ ఫోన్ లోని డేటా మొత్తం తన చేతిలో ఉందని బ్లాక్ మెయిల్ చేస్తూ, భయంకరమైన ఫొటోస్ పెడుతూ భయపెడుతూ ఉంటాడు. అతను ఎవరు అనేది మీకు కూడా తెలియదు. చివరికి ఆట ముగించే టాస్క్ కి రాగానే మీరు ఆత్మహత్య చేసుకోవాలని శాసిస్తాడు.
ఇటీవల మొదలైన ఈ ఆట ప్రపంచం మొత్తం సంచరిస్తూ మన దేశాన్ని కూడా చేరుకుంది. పశ్చిమ బెంగాల్ లోని ఓ యువతికి వాట్స్ ఆప్ లో ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఈ ఆటయొక్క లింక్ వచ్చింది. అంతే కాదు.. ఆ లింక్ సెండ్ చేసిన వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడటంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు సైబర్ క్రైమ్ గా పరిగణించి ఆ లింక్ ను పరీక్షించగా అది మోమో ఛాలెంజ్ గేమ్ అని తెలిసింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు మీడియా వాళ్ళకి విషయం తెలియజేసి మోమో ఛాలెంజ్ గేమ్ లింక్ ఎవరికైనా వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయమని ఆదేశించారు. కొన్ని రోజుల క్రితం అర్జెంటీనా కు చెందిన 12 ఏళ్ళ బాలిక ఈ మోమో ఛాలెంజ్ ని ఆడి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఫోన్ లో గేమ్స్ అంటే ఇష్టపడే ఎంతో మంది చిన్నారులు ఇలాంటి ఆటల వలలో పడి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకునే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త ..!