పైన ఉన్న దేవతలంతా ఆకాశంలోని ఒక తారను భూమ్మీదకు పంపి జీవించమని దీవించి పంపారు… ఆ తారే మెగాస్టార్‌గా వెలుగొందుతోంది… ఇంతకన్నా ఏం చెప్పగలం.. నేడు మెగాస్టార్ చిరు పుట్టిన రోజు! తెలుగు సినీ పరిశ్రమకు ఒక పండుగ రోజు. కొంత విరామానంతరం మెగాస్టార్ చిరంజీవి చిత్రసీమకు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇది రెండవ బర్త్ డే. అంగరంగ వైభవంగా చిరు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.
తెలుగు వెండితెరకు చిరంజీవిగా పరిచయమైన శివశంకర వరప్రసాద్ అంచెలంచెలుగా ఎదిగి సుప్రీమ్ స్టార్ అయ్యాడు, అనతి కాలంలోనే మెగాస్టార్ అయ్యాడు. ఆగస్ట్ 22, 1955లో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. తండ్రి వృత్తిరిత్యా కానిస్టేబుల్ అయినందున పాఠశాల విద్యను వివిధ ప్రాంతాల్లో పూర్తి చేసారు. ఇంటర్మీడియెట్‌ను ఒంగోలులోని సి.ఎస్.ఆర్ కాలేజీలో అలాగే నర్సాపూర్‌లోని వైఎన్ కాలేజీలో డిగ్రీ వరకు చదివారు. ఆ తర్వాత నటనపై మక్కువతో 1976లో మద్రాసు వచ్చి మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ స్కిల్స్‌లో డిప్లొమో పట్టా పొందారు.
పునాది రాళ్లు సినిమాతో అతని సినీ జీవితం ప్రారంభమైంది. కానీ ప్రాణం ఖరీదు సినిమా ముందుగా రిలీజైంది. విలన్ పాత్రలను సైతం కాదనకుండా నటిస్తూ, అలాగే మల్టీస్టారర్ చిత్రాలలో కూడా నటించాడు. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా తనను నటుడిగా ఒక మెట్టు పైకి ఎక్కించింది, ఆ సినిమా తర్వాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, సంఘర్షణ, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, యముడికి మొగుడు, దొంగ మొగుడు వంటి వరుస విజయాలతో సుప్రీమ్ స్టార్ నుండి మెగాస్టార్ అయ్యాడు. విజేత, స్వయంకృషి, రుద్రవీణ వంటి సందేశాత్మక చిత్రాలతో సైతం నటించి మెప్పించాడు. అందులో రుద్రవీణ చిత్రానికి గానూ జాతీయ ఉత్తమ సమగ్రతా చిత్రం అవార్డు కూడా వచ్చింది.
తాజాగా ఈరోజు 66వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న చిరు ఈ సారి ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చిరంజీవి ఒకప్పటి హీరోలైన ఎన్టీయార్, ఏఎన్నార్, కృష్ణలతోనే కాకుండా వారి తరువాతి తరాలకు, అలాగే వారి మూడవ తరానికి కూడా పోటీగా నటిస్తూ నేను ఎవర్‌యూత్ అంటూ సాగిపోతున్నారు. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చిరుకి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. ఆరు పదుల వయస్సులోను ఎంతో ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న చిరు మరిన్ని మంచి సినిమాలతో మనల్ని అలరిస్తూ,ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.