సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తోన్న యు టర్న్ సినిమా ట్రైలర్‌ను సినీమాక్స్‌లో చిత్ర యూనిట్ సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ఓ వైపు మాజీ ప్రధానమంత్రి వాజ్ పెయి మరణం.. మరోవైపు కేరళ వరదలు ముంచెత్తుతున్న ఈ సమయంలో కూడా తమ సినిమా ప్రెస్ మీట్‌కు వచ్చినందుకు మీడియా అందరికి ధన్యవాదాలు. కానీ మాది చిన్న సినిమా.. అందరూ అర్థం చేసుకుంటారనే ఆశిస్తున్నాను. యు టర్న్ అనేది ఓ హానెస్ట్ సినిమా.. దీనికి పని చేసినవాళ్లంతా వందశాతం తమ కృషి పెట్టారు. ఇది మంచి సినిమా అని.. మేం మంచి ప్రయత్నం చేసామనే అనుకుంటున్నాం.
కెరీర్‌లో తొలిసారి కొత్త నిర్మాతలతో పని చేస్తున్నాను.. చాలా కంఫర్ట్‌గా ఉంది. మా దర్శకుడు పవన్ కుమార్ కూడా అద్భుతంగా పని చేశాడు. కన్నడలో పెద్ద దర్శకుడు అయినా కూడా ఇక్కడ బాగా సపోర్ట్ చేశాడు. ఫ్యూచర్‌లో మరో సినిమా కూడా చేయాలని కోరుకుంటున్నాను. రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి ఈ చిత్రానికి మరింత స్టార్ పవర్ అందించారు. సినిమాటోగ్రఫర్ నికేత్ ఇండస్ట్రీలో చాలా దూరం వెళ్తాడని ఆశిస్తున్నాను అని చెప్పారు.
దర్శకుడు పవన్ కుమార్ మాట్లాడుతూ.. సమంతను మూడేళ్ల కింద కలిసాను. ఆమెతో ప్రయాణం అద్భుతంగా ఉంది.. తెలుగు ఇండస్ట్రీ కూడా చాలా బాగుంది. నేను పుట్టింది అనంతపూర్ లో. మా అమ్మ తెలుగు.. అందుకే తెలుగు సినిమాలు చూస్తూనే పెరిగాను. ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు.. అదే రోజు నా తొలి తెలుగు సినిమా ట్రైలర్ విడుదల కావడం నిజంగా యాదృశ్చికమే. యు టర్న్ ఆసక్తికరంగా ఉంటూనే నవ్విస్తూ ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది. మంచి క్యాస్టింగ్ తోనే ఈ సినిమాను తెరకెక్కించాం అన్నారు.
రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. పదేళ్ల కింద నేను, సమంత కలిసి పనిచేశాం. అప్పటికి ఇప్పటికీ సమంత నటిగా పూర్తిగా మారిపోయింది. గొప్ప నటిగా ఎదిగింది. ఆది వాయిస్‌కు నేను పెద్ద ఫ్యాన్. ఆయన స్వరం అందంగా ఉంటుంది. వైశాలి సినిమాలో ఆయన చివరిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు నటిస్తున్నారు. ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను అన్నారు.
ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమాకు చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది. దానికి చాలా కారణాలున్నాయి. ఇలాంటి టీంతో మళ్లీ మళ్ళీ పని చేయాలని ఉంది. తొలి రోజు షూటింగ్ పూర్తి కాగానే గుడ్డిగా దర్శకున్ని నమ్మేసాను. పవన్ కుమార్ ఏం చెబితే అది చేశాను. సమంత విషయానికి వస్తే.. రంగస్థలంలో కలిసి పని చేసినా కూడా ఆమె నటన గురించి కానీ.. ఆమె గురించి కానీ పూర్తిగా తెలియలేదు. కానీ ఇప్పుడు తెలిసింది.. సమంత మంచి మనిషి కూడా. ఈమె లాంటి బెస్ట్ యాక్ట్రెస్‌ను ఇప్పటి వరకు కలవలేదు అన్నారు.
ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో సమంత, ఆది, రాహుల్, దర్శకుడు పవన్ కుమార్, సినిమాటోగ్రఫర్ నికేత్ బొమ్మి, నిర్మాతలు శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు పాల్గొన్నారు.. నటీనటులు: సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా, నరైన్.. సాంకేతిక నిపుణులు: కథ, దర్శకుడు: పవన్ కుమార్, నిర్మాతలు: శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు, బ్యానర్స్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మరియు వివై కంబైన్స్, సంగీతం: పూర్ణ చంద్ర తేజస్వి, సినిమాటోగ్రఫర్: నికేత్ బొమ్మి, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్: సురేష్ ఆర్ముగం, పిఆర్ఓ: వంశీ శేఖర్.